మళ్లీ గొప్ప మనసు చాటుకున్న యంగ్ టైగర్

Wed Jun 29 2022 19:03:07 GMT+0530 (IST)

Young Tiger NTR Responding to Fan

అభిమానులే తమ దేవుళ్లుగా భావిస్తూ వుంటారు మన టాలీవుడ్ స్టార్స్. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. అలాంటి వారికే కష్టం వస్తే తామున్నామంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న హీరో వరకు తమ ఫ్యాన్స్ కి కష్టం వస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు.సొంత ఫ్యామిలీ మెంబర్ లా వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నారు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్.. ఇలా ప్రతీ హీరో తమ అభిమానులకు కష్టం వస్తే మేమున్నామంటూ ధైర్య చెప్పడం పలువురిని ఆకట్టుకుంటోంది.

ఇటీవల ఓ అభిమాని ఐసీయూలో వున్నాడని తెలిసి స్టార్ హీరో ఎన్టీఆర్ వెంటనే అతను ఏ హాస్పిటల్ లో వున్నాడో తన టీమ్ ద్వారా తెలుసుకుని వీడియో కాల్ లో అతనితో మాట్లాడి ధైర్యాన్నిచ్చారు.

గత ఏడాది ఈ వీడియో కాల్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారి ఎన్టీఆర్ గొప్ప మనసుని ప్రపంచానికి చాటింది. తాజాగా మరోసారి ఇదే తరహాలో స్పందించి తన గొప్ప మనసుని చాటుకున్నారు ఎన్టీఆర్.

జనార్థన్ అనే ఓ అభిమాని పరిస్థితి క్రిటికల్ గా వుందని అతను ఐసీయూలో వున్నాడని తెలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సదరు హాస్పిటల్ కి తన టీమ్ ని పంపించారు. ఫోన్ ద్వారా అక్కడే తనయుడు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అతని తల్లితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

అధైర్య పడకుండా దేవుడిని నమ్మండి..దేవుడిపైన భారం వేయండి.. మేమంతా వున్నాం..త్వరలోనే తను కోలుకుని క్షేమంగా తిరిగి వస్తాడని మీరు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అధైర్య పడొద్దని మీరు తన పక్కనే వుండి ధైర్యం చెప్పండని తన అభిమాని తల్లికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.