చిరు - నాగ్ లను చూసి ఎంతైనా నేర్చుకోవాలి..!

Fri Sep 30 2022 09:43:05 GMT+0530 (India Standard Time)

You have to learn a lot by watching chiru Nag..!

టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ అక్కినేని నాగార్జున ఇద్దరూ దసరా బరిలో దిగుతున్నారు. అగ్ర నటులు నటించిన 'గాడ్ ఫాదర్' & 'ది ఘోస్ట్' సినిమాలు అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నాయి. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఇద్దరు హీరోల సినిమాలు తొలిసారిగా ఒకే రోజు రిలీజ్ అవుతుండంతో అందరిలో ఆసక్తి నెలకొంది.చిరు - నాగ్ ఇద్దరూ తమ తమ సినిమాల మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంత నమ్మకం ఉంది కాబట్టే 'ది ఘోస్ట్' చిత్రాన్ని నాగార్జున ఆంధ్రాలో నాలుగు ప్రాంతాల రైట్స్ తీసుకున్నారు. మరోవైపు మెగా బ్యానర్ లో రూపొందిన 'గాడ్ ఫాదర్' సినిమాని సొంతంగానే రిలీజ్ చేస్తున్నారు.

కెరీర్ లో ఎన్నో హిట్లు - సూపర్ హిట్లు సాధించిన సీనియర్ స్టార్ హీరోలిద్దరూ.. తమ చిత్రాలను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. షష్టిపూర్తి దాటిని వయస్సులోనూ ఎంతో ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తమ విజయం కోసం.. నిర్మాతలకు లాభాలు అందేలా చూడటం కోసం ప్రచారాన్ని తమ భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు.

నాగార్జున ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో 'ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. 1989లో 'శివ' సినిమాలో సైకిల్ చైను పట్టుకొని వచ్చాను.. అదే అక్టోబర్ 5న ఈసారి ఒక కత్తి పట్టుకొని రాబోతున్నాను అంటూ కచ్చితంగా హిట్టు కొడతాననే ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు చిరంజీవి అనంతపురంలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. అభిమానులు ఎంత ఊహించుకుంటారో అంతకుమించి ఈ సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పారు. వర్షంలో తడుస్తున్న సమయంలో కూడా డెబ్యూ హీరోలా చాలా నిరాడంబరంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.

అలానే తన అత్యంత ఆప్తుడు నటించిన 'గాడ్ ఫాదర్' కూడా సక్సెస్ అవ్వాలని నాగ్ కోరుకుంటే.. తన మిత్రుడు నటించిన 'ది ఘోస్ట్' సినిమాకు కూడా విజయం వరించాలని చిరు కోరుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎలాంటి పోటీ ఉండాలనేది చెప్పకనే చెప్పారు.

ఇటీవలి కాలంలో యువ హీరోలే తమ సినిమా ప్రమోషన్స్ లో ఏదో మొక్కుబడిగా పాల్గొంటుంటే.. సీనియర్ హీరోలిద్దరూ నూతనోత్సాహంతో తమ చిత్రాలను ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ అనేవి సినిమా విజయానికి ఎంతగా దోహదం చేస్తాయి.. వాటి ప్రాధాన్యత ఏంటనేది తెలియజెప్తున్నారు.

ఏదో ఒక ఇంటర్వ్యూ రికార్డ్ చేసి మీడియాలో వదలకుండా.. నాగ్ ఎంతో ఓపికగా ప్రతీ టీవీ ఛానల్ మరియు యూట్యూబ్ ఛానల్స్ కు స్పెషల్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వైజాగ్ లో మధ్యాహ్నం వరకూ షూటింగ్ చేసి.. సాయంత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడంటే చిరు డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక తమ సినిమాల కోసం అగ్ర హీరోలిద్దరూ చాలా కష్టపడ్డారు. చిరంజీవి ఒకేసారి మూడు నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకొచ్చి కుర్ర హీరోలకు పోటీగా షూటింగ్ లలో పాల్గొన్నారు. 67 ఏళ్ల వయస్సులో 'గాడ్ ఫాదర్' సినిమాలో అంత ఫిట్ గా పర్ఫెక్ట్ గా కనిపించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరోవైపు 63 ఏళ్ల నాగార్జున 'ది ఘోస్ట్' సినిమా కోసం తీవ్రంగా శ్రమించాడు. ఇన్నేళ్ల అనుభవం ఉన్నా కూడా ఒక డెబ్యూ హీరో మాదిరిగా వర్క్ షాప్స్ లో పాల్గొన్నారు.. యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. అలానే ఈ వయసులో డూప్ లేకుండా బైక్ ఛేజింగ్ సీన్లు చేయడం ఆయనకే చెల్లింది.

ఇలా సూపర్ సీనియర్ హీరోలైన చిరంజీవి - నాగార్జున.. తమ సినిమాల విజయం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ప్రమోషన్స్ ద్వారా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో తమ బాధ్యత నిర్వహిస్తున్నారు. సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. ఇలాంటి విషయాలలో వీరిద్దరినీ యువ హీరోలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.