Begin typing your search above and press return to search.

'యాత్ర' ప్రారంభమవ్వనుంది ఇలా..!

By:  Tupaki Desk   |   23 Jan 2019 8:34 AM GMT
యాత్ర ప్రారంభమవ్వనుంది ఇలా..!
X
ఏపీ మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ 'యాత్ర' విడుదలకు సిద్దం అయ్యింది. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోపిక్‌ లో వైఎస్‌ ఆర్‌ పాత్రను మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటీ పోషించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంపై రాజశేఖర్‌ అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వైకాపా శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో యూనిట్‌ సభ్యులు బిజీ అయ్యారు.

ఇక ఈ చిత్రం ఆరంభంలోనే యడుగురి సందిటి రాజశేఖర్‌ రెడ్డి అనే నేను అంటూ మమ్ముటీ చెప్పే డైలాగ్‌ ఉంటుందట. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా సినిమా ఆరంభం అవుతుందట. ప్రమాణ స్వీకారం పూర్తవ్వడంతోనే మమ్ముటీ నిద్ర నుండి లేస్తాడు. అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది కలలో చూపిస్తారన్నమాట. ఆ సమయంలో మమ్ముటీ నటన అద్బుతంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా ప్రారంభంతోనే ప్రేక్షకులను కట్టిపడేసే నటనతో మమ్ముటీ సినిమాను హై లెవల్‌ కు తీసుకు వెళ్తాడట.

తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సెన్సార్‌ బోర్డు నుండి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. కట్స్‌ ఏమీ లేకుండా క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ వచ్చిన ఈ చిత్రంలో చివరి పది నుండి పది హేను నిమిషాలు రియల్‌ ఫుటేజ్‌ ను చూపిస్తారట. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.