Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ రిలీజ్ ల‌పై వ‌ర‌ల్డ్ క‌ప్ ఎఫెక్ట్?

By:  Tupaki Desk   |   27 Jun 2019 2:30 PM GMT
టాలీవుడ్‌ రిలీజ్ ల‌పై వ‌ర‌ల్డ్ క‌ప్ ఎఫెక్ట్?
X
14 -07-2019 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగే తేదీ ఇది. ఇంగ్లండ్ లో జ‌రుగుతున్న టోర్న మెంట్ లో టీమిండియా దూకుడు చూస్తుంటే ఈసారి ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. లీగ్ ద‌శ‌లో టీమిండియా అజేయంగా దూసుకెళుతోంది. ఇప్ప‌టికే ఐదు మ్యాచుల్లో ఒక‌టి క్యాన్సిల్ కాగా ఆడిన నాలుగు మ్యాచ్ ల‌లో గెలిచింది. ద‌క్షిణాఫ్రికా- పాకిస్తాన్- ఆఫ్ఘ‌నిస్తాన్ ల‌పై నెగ్గింది. న్యూజిల్యాండ్ తో మ్యాచ్ ర‌ద్ద‌యి ఒక పాయింట్ గెలుచుకుంది. నేడు వెస్టిండీస్ తో మ్యాచ్ లో త‌ల‌ప‌డుతోంది. అప‌జ‌యం లేకుండా వెళితే టీమిండియా జూలై 14న ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతుంది. స‌రిగ్గా ఆ మ్యాచ్ కి అటూ ఇటూ రెండు శుక్ర‌వారాలు నాలుగు సినిమాలు రిలీజ‌వుతున్నాయి.

వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల జోరు మీదున్న‌ప్పుడు ప‌లు తెలుగు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. జూలై 12న దొర‌సాని .. నిను వీడ‌ని నీడ‌ను నేను చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్ కి రెండ్రోజుల త‌ర్వాత జూలై 18న రాక్ష‌సుడు.. ఐస్మార్ట్ శంక‌ర్ చిత్రాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో వ‌ర‌ల్డ్ క‌ప్ సెగ ఏ సినిమాల‌కు ఉంటుంది? అంటే అది ఇండియా అజేయ‌మైన‌ విక్ట‌రీపై ఆధార‌ప‌డి ఉంటుంది. టీమిండియా లీగ్ ద‌శ నుంచి సెమీస్ కి చేరుకుని.. సెమీ ఫైన‌ల్స్ లోనూ నెగ్గి ఫైన‌ల్ మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ ల‌న్నిటినీ జ‌నాలు టీవీల‌కు క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తారు. ఆ మేర‌కు ఆ మ్యాచ్ లు జ‌రిగేప్పుడు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు ఆస‌క్తి చూప‌రు. అంటే ఆ మేర‌కు రిలీజ‌వుతున్న సినిమాల వ‌సూళ్ల పై ప్ర‌భావం ప‌డుతున్న‌ట్టే. ఓవ‌రాల్ గా వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌భావం సినిమాల‌పై అంతో ఇంతో ఉంటుంద‌న్న‌ది ఊహించేదే.

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ- శివాత్మిక జంట‌ను ప‌రిచ‌యం చేస్తూ రూపొందిస్తున్న‌ దొర‌సాని .. సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `నిను వీడ‌ని నీడ‌ను నేను` చిత్రాలు జూన్ 12న రిలీజ‌వుతున్నాయి. అంటే వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల హీట్ పీక్స్ లో ఉన్న‌ప్పుడు ఇవి రెండూ బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నాయి. జూలై 14న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఇండియా ఆడుతుందా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. ఆడుతుంద‌నే అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫీవ‌ర్ ఓ రేంజులో ఉంది కాబ‌ట్టి సెమీస్.. ఫైన‌ల్ మ్యాచ్ లు ఇండియా ఆడేప్పుడు ఆ మేర‌కు సినిమాల క‌లెక్ష‌న్స్ పై ప్ర‌భావం చూపే వీలుంటుంది.

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ త‌ర్వాత వ‌స్తున్న సినిమాల‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. అప్పటికే ఫైన‌ల్ మ్యాచ్ పూర్త‌వుతుంది కాబ‌ట్టి క్రికెట్ హీట్ జీరో అయిపోతుంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ రాక్ష‌సుడు (ర‌చ్చాస‌న్ రీమేక్) చిత్రానికి ఎన‌ర్జిటిక్ రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రాలు ఫైన‌ల్ మ్యాచ్ అయిపోయాకే రిలీజ‌వుతున్నాయి. అయితే ఆ రెండూ వాటిక‌వే పోటీ. కొన్ని వ‌రుస ఫ్లాప్ ల త‌ర్వాత‌ బెల్లంకొండ లానే రామ్ కూడా ఈసారి స‌క్సెస్ పై హోప్స్ పెట్టుకున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ కి ఇటీవ‌ల‌ స‌క్సెస్ లేదు కాబ‌ట్టి అత‌డు ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్ గా రూపొందిస్తున్నారు. మ‌రి రేసులో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న‌ది చూడాలి. మ‌రోవైపు ఇస్మార్ట్ శంక‌ర్.. రాక్ష‌సుడు రిలీజైన త‌ర్వాతి వారంలో విజ‌య్ దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్` రిలీజ్ కి వ‌స్తోంది.