Begin typing your search above and press return to search.

ఓటీటీలో నాలుగు భాషల్లో 'వండర్ ఉమెన్ 1984'..!

By:  Tupaki Desk   |   12 May 2021 6:30 AM GMT
ఓటీటీలో నాలుగు భాషల్లో వండర్ ఉమెన్ 1984..!
X
హాలీవుడ్ సూపర్ హీరో డ్రామా ''వండర్ ఉమెన్ 1984'' గతేడాది కరోనా సమయంలో థియేట్రికల్ రిలీజ్ అయింది. అనేక వాయిదాల తర్వాత విడుదల కాబడిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ పెడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ నెల 15న నాలుగు భాషల్లో 'వండర్ ఉమెన్ 1984' ని రిలీజ్ చేస్తున్నారు.

పాటీ జంకిన్స్ దర్శకత్వం వహించిన 'వండర్ ఉమెన్ 1984' మూవీలో గాల్ గాడోట్ ప్రధాన పాత్ర పోషించారు. క్రిస్ పైన్ - క్రిస్టెన్ విగ్ - పెడ్రో పాస్కల్ ఇతర కీలక పాత్రలు పోషించారు.1984 కోల్డ్ వార్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వండర్ ఉమన్‌ గా గాళ్ గాడట్.. స్టీవ్ ట్రెవర్ పాత్రలో పైన్.. చిరుత పాత్రలో క్రిస్టిన్ విగ్ - మాస్వెల్ లార్డ్ పాత్రలో పాస్కల్ నటించారు. ఈ విజువల్ వండర్ ని వార్నర్ బ్రదర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది డీసీ కామిక్స్ సిరీస్ లోని తొమ్మిదవ చిత్రం.

అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన 'వండర్ ఉమన్' సినిమాకు ఇండియాలో కూడా మంచి ఆదరణ దక్కింది. అందుకే ''వండర్ ఉమెన్ 1984'' చిత్రానికి కూడా క్రేజ్ ఏర్పడింది. అయితే కోవిడ్ టైంలో రిలీజ్ అవడంతో జనాలు ఈ సినిమాని థియేటర్లకు వెళ్లి చూడటానికి ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ భాషల్లో అందుబాటులోకి వస్తోంది. మరి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.