అదిరిపోయిన '#Suriya40' సెకండ్ అండ్ థర్డ్ లుక్స్..!

Fri Jul 23 2021 17:00:01 GMT+0530 (IST)

With these posters it seems to be a powerful mass action movie

'ఆకాశం నీ హద్దురా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం మూడు సినిమాలతో పాటుగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో ఒకరైన సూర్య.. పాండిరాజ్ దర్శకత్వంలో తమ 40వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్ పోస్టర్స్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఈరోజు (జూలై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం.. సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసి మూడు లుక్స్ ని రిలీజ్ చేశారు.'#Suriya40' చిత్రానికి ''ఎతరెక్కుమ్ తునింధవన్'' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ వీడియోలో ఒక చేతిలో తుపాకీ మరో చేతిలో ఖడ్గం పట్టుకొని ఊర మాస్ గా కనిపించాడు. ఇక సెకండ్ లుక్ లో విలన్లను వేటాడి చేతిలో కత్తి పట్టుకొని కూర్చొని కోపంగా చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ లుక్ లో పంచె కట్టులో సూర్య ని చూపించగా.. సెకండ్ పోస్టర్ లో జీన్స్ లో చూపించారు. థర్డ్ లుక్ లో సూర్య ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్స్ తో ఇదొక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.

సూర్యతో 'పసంగ 2' - కార్తీతో 'చినబాబు' చిత్రాలు తీసిన దర్శకుడు పాండిరాజ్.. ''ఎతరెక్కుమ్ తునింధవన్'' చిత్రాన్ని వాటికి విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సత్యరాజ్ - జయప్రకాశ్ - శరణ్య - సుబ్బు పంచు - దేవదర్శిని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇకపోతే విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య 'వాడివాసల్' అనే సినిమాలో నటిస్తున్నారు. వి క్రియేషన్స్ పతాకంపై ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే హోమ్ బ్యానర్ లో తా.సే. జ్ఞానవేల్ దర్శకత్వంలో '#Suriya39' సినిమా రూపొందుతోంది. సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈరోజే విడుదల అవుతుంది.