'పే ఫర్ వ్యూ' విధానం తెలుగులో వర్కౌట్ అవుతుందా..?

Sat May 15 2021 12:00:01 GMT+0530 (IST)

Will the Pay for View approach be a workout in Telugu?

కరోనా మహమ్మారి కారణంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ కు మాత్రమే అవకాశం ఉంటే.. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా డిజిటల్ వేదికలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది థియేటర్స్ క్లోజ్ అవడంతో టాలీవుడ్ లో కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ సత్తా చాటాయి. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలన్నీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు 'పే ఫర్ వ్యూ' మోడల్ లో విడుదల అయ్యాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ మార్కెట్ గురించి ఆలోచిస్తూ వచ్చిన స్టార్ హీరోలు సైతం ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు వెళ్తతున్నారు.లేటెస్టుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ తో పాటుగా పే ఫర్ వ్యూ పద్దతిలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో కూడా రిలీజ్ చేశారు. దీనికి రూ.249 టికెట్ ధరగా పెట్టారు. ఓటీటీలతో పాటుగా అందుబాటులో ఉన్న థియేటర్లలో విడుదలైన 'రాధే' టాక్ సంబంధం లేకుండా భారీ వ్యూస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే మార్గంలో కొన్ని తెలుగు సినిమాలు నడవడానికి రెడీ అవుతున్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాలను డిజిటిల్ వేదికలలో విడుదల చేయాలని కొందరు భావిస్తున్నా.. 'పే ఫర్ వ్యూ' మోడల్ తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సల్మాన్ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నా భారీగా కలెక్షన్స్ రాబట్టిందని అంటున్నారు. ఫస్ట్ డే అంటే ఓకే.. కానీ సెకండ్ డే నుంచి పరిస్థితి ఏంటి?. డైరెక్ట్ ఓటీటీ రిలీజులకు పైరసీ అనేది చాలా ఇబ్బందిగా మారిందనే విషయం తెలిసిందే. స్ట్రీమింగ్ కి పెట్టిన కొన్ని నిమిషాల్లోనే హై క్వాలిటీ ప్రింట్ విత్ సబ్ టైటిల్స్ పైరసీ సైట్స్ లో దర్శనమిస్తోంది.

ఫస్ట్ డే మినహాయిస్తే దాదాపుగా అందరూ పైరసీ డౌన్ లోడ్ చేసుకుని చూసే అవకాశం ఉంది. ఓటీటీ వాళ్ళు ఓ వారం పాటు పే ఫర్ వ్యూ పెట్టి తర్వాత ఫ్రీ చేస్తారు. ఈలోపు పైరసీ వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదంతా చూసుకుంటే తెలుగులో 'పే ఫర్ వ్యూ' విధానం వర్క్ ఔట్ అయ్యేది అనుమానమే. ఇప్పటికే తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన ఓ చిత్రాన్ని ఇలానే 'పే ఫర్ వ్యూ' పద్ధతిలో విడుదల చేయగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీనిని బట్టి చూస్తే సినిమాను రికార్డ్ చేసుకునే అవకాశం లేకుండా.. పైరసీ చేసే ఛాన్స్ లేకుండా థియేట్రికల్ రిలీజ్ తో పాటుగా పే ఫర్ వ్యూ విధానంలో విడుదల చేయగలిగితే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.