Begin typing your search above and press return to search.

ఆలీ జాక్ పాట్ కొట్టేస్తారా... ?

By:  Tupaki Desk   |   21 Oct 2021 9:35 AM GMT
ఆలీ జాక్ పాట్ కొట్టేస్తారా... ?
X
ఆలీతో సరదాగా అంటూ అందరినీ జాలీగా నవ్వించే టాలీవుడ్ స్టార్ కెమేడియన్ ఆలీ కి జాక్ పాట్ తగలనుందా. ఆయన జాతకం ఒక్కసారిగా మారిపోనుందా. అంటే జవాబు అవును అనే వస్తోంది. ఎపుడేమి జరుగుతుందో ఎవరికి తెలుసు. అందునా రాజకీయాల్లో ఎవరు రాజు అవుతారో కూడా చెప్పడం కష్టమే. ఆలీ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆయన జగన్ని స్వయంగా కలసి మద్దతు ప్రకటించారు. ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించి వైసీపీ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. అదే విధంగా తన సినీ మిత్రుడు పవన్ కళ్యాణ్ తో కూడా రాజకీయాల వల్ల కొంత మిత్ర భేదాన్ని కూడా చూడాల్సి వచ్చింది.

మరి ఇంత చేసిన ఆలీకి వైసీపీలో దక్కింది ఏంటి అన్న చర్చ అయితే చాన్నాళ్ళుగా ఉంది. ఆలీ అయితే వైసీపీలో చేరాక ఎమ్మెల్యే టికెట్ కోరుకున్నారు. అప్పటికే జగన్ టికెట్ల ఎంపికను పూర్తి చేయడంతో ఆలీకి ఏం చేయలేకపోయారు. అయితే నాడు వైసీపీ అధినాయకత్వం ఆలీకి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం అయితే సాగింది. పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తామని కూడా చెప్పారని దాని సారాంశం. ఇపుడు ఏపీలో ఏకంగా 14 ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. ఇందులో నుంచి ఒకదాన్ని ఆలీకి కేటాయించాలని వైసీపీ పెద్దలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ కోటాలో, మైనారిటీ వాటలో కూడా ఆలీకి ఈ పదవి రిజర్వ్ అయింది అంటున్నారు.

ఆలీకి ఈ టైమ్ లో పదవి ఇవ్వడం అంటే దాని వెనక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజమండ్రీకి చెందిన ఆలీ అక్కడ సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతూ జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. మరో రెండున్నరేళ్లలో జరిగే ఎన్నికల్లో ఆలీ కచ్చితంగా వైసీపీకి ఉపయోగపడతారు అని కూడా అంచనా వేస్తున్నారు. దాంతో పాటు అటు వైపు పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన్ని సినీ సీమ నుంచి ఢీ కొట్టే ఆయుధంగా ఆలీని వాడుకోవచ్చు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయట. 2019 ఎన్నికల తరువాత ఆలీ, పవన్ మనస్పూర్తిగా మళ్లీ కలిసింది లేదు. ఇపుడు ఆలీకి వైసీపీలో కీలక పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే ఆయన కచ్చితంగా పవన్ సహా ప్రత్యర్ధులను ఢీ కొడతారు అంటున్నారు.

ఇక తెలుగు సినిమా రంగం విషయంలో కూడా వైసీపీ సీరియస్ గానే దృష్టి పెట్టింది అంటున్నారు. తమకంటూ కొంత‌ స్పేస్ అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు. సినీ రాజకీయాలు కలగలసిపోయిన వర్తమానంలో వైసీపీ కూడా తన మద్దతుదారులను పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే మా ప్రెసిడెంట్ గా నెగ్గిన మంచు విష్ణు వైసీపీకి కావల్సిన వారే. ఆ విధంగా ఆలీకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ప్రోత్సహిస్తే ఆయన ద్వారా సినీ మద్దతు కూడా మరింతగా పొందవచ్చు అన్న ఎత్తుగడలు ఏవో ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఆలీ ఇక మీదట పెద్దల సభ్యుడు అనే అంటున్నారు. నవంబర్ మొదటి వారంలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది, అందులో ఆలీ పేరు ఉండడం డ్యామ్ ష్యూర్ అంటున్నారు. అదే జరిగితే జాలీగా ఆలీ కాదు, జాక్ పాట్ ఆలీ అనే చెప్పాలేమో.