Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోయిన్ రాధ రీ ఎంట్రీ ఇస్తుందా?

By:  Tupaki Desk   |   16 Sep 2021 11:30 PM GMT
సీనియర్ హీరోయిన్ రాధ రీ ఎంట్రీ ఇస్తుందా?
X
తెలుగు తెరపై అందాల సందడి చేసిన నిన్నటితరం కథానాయికలలో రాధ ఒకరు. చక్కని కనుముక్కుతీరుతో అందమైన అభినయాన్ని పలికించడంలోను .. డాన్స్ చేయడంలోను రాధ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1980లలో స్టార్ హీరోయిన్స్ రేసులో విజయశాంతి తరువాత వినిపించిన పేరు రాధ. అప్పటి స్టార్ హీరోలందరితో ఆమె జట్టుకట్టినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం చిరంజీవితోననే చెప్పాలి. అలాంటి రాధను గురించి 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

"రాధ గారి గురించి చెప్పాలంటే .. 'చండశాసనుడు' సినిమాను గురించి మాట్లాడాలి. 'అనురాగదేవత' సినిమా సమయంలో మంచి కథ ఏదైనా ఉంటే చెప్పమని అన్నగారు అడిగితే, నేను 'చండశాసనుడు' కథ రాసుకుని వెళ్లాను. ఆ కథ వినగానే ఆయనకి బాగా నచ్చేసింది. 'పరుచూరి బ్రదర్స్' అనే పేరు సెట్ అయిన తరువాత తెరపై నా పేరు మాత్రమే పడిన ఒకే ఒక్క సినిమా ఇది. అప్పుడు మా అన్నయ్యకి సెలవు దొరక్కపోవడం వలన, ఆయన ఈ సినిమాకి పనిచేయలేకపోయాడు. అందువలన అన్నగారు నా ఒక్కడి పేరే వేశారు.

ఈ సినిమాలో రాధాగారు .. అన్నగారి సరసన హీరోయిన్ గా పరిచయమయ్యారు. చిరంజీవితో సమానంగా ఆమె డాన్స్ చేసేవారు. అభ్యంతరకర సన్నివేశాలు చేయవలసి వచ్చినప్పుడు .. అలాంటి డైలాగ్స్ చెప్పవలసి వచ్చినప్పుడు రాధ గారు చాలా ఇబ్బందిపడిపోయేవారు. మార్చమని చెప్పి దర్శకుడిని రిక్వెస్ట్ చేసేవారు. 'అగ్నిపర్వతం' సినిమా షూటింగు సమయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. విజయశాంతి తరువాత మా సినిమాలలో ఎక్కువగా చేసింది రాధగారే. 'కొండవీటి రాజా' సినిమాలో ఇద్దరూ పోటీపడి నటించారు.

'అడవిదొంగ' సినిమాలోనూ రాధగారు అద్భుతంగా నటించారు. శ్రీదేవి - జయప్రద బాలీవుడ్ ను ఏలేస్తున్న సమయంలో రాధగారు కూడా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. కావాలనే రాధను పోటీకి తెచ్చారని కూడా అక్కడ చెప్పుకున్నారు. నిజంగానే పోటీకి వెళ్లగలిగే సత్తా ఉన్న మంచి నటి ఆమె. రాధగారికి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అక్క .. వదిన వంటి పాత్రలతో ఆమె రీ ఎంట్రీ ఇస్తే వాళ్లు ఎంతో సంతోషపడతారు.

అందువలన రాధ మళ్లీ వెండితెరపైకి వస్తే బాగుంటుంది. ఓటీటీ సినిమాల పరంగా కూడా సీనియర్ హీరోయిన్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. చాలామంది కొత్త దర్శకులు .. పాత తరం ఆర్టిస్టుల కోసం వెదుకుతున్నారు. అందువలన రాధగారు రావాలి .. ఆమె అక్కయ్య అంబిక గారు కూడా రావాలని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. మరి రాధ రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.