Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మాట... జగన్ వింటారా... ?

By:  Tupaki Desk   |   26 Nov 2021 11:30 PM GMT
మెగాస్టార్ మాట... జగన్ వింటారా... ?
X
టాలీవుడ్ కి ఎవరు అవునన్నా కాదన్న మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కు అనే చెప్పాలి. ఈ పెద్దరికం ఎలా వచ్చింది, తనకు తానుగా ఆయన కట్టబెట్టుకున్నారా అని కొందరు విమర్శలు చేయవచ్చు కానీ చిరంజీవి పది మంది కోసం ముందుకు వచ్చే మనస్తత్వం కలిగిన వారు. అందుకే ఆయన కష్టాల్లో సినీ పరిశ్రమ ఉన్నప్పుడల్లా తానుగా స్పందిస్తూంటారు. కరోనా టైమ్ లో కూడా ఆయన సినీ కార్మికులకు సేవ చేశారు. ఇక ఆ మధ్య కూడా ఒక సినిమా ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ టాలీవుడ్ ని ఆదుకోవడానికి రెండు తెలుగు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరారు. ఇక గత ఏడెనిమిదేళ్ళుగా రద్దు అయినా నంది పురస్కారాలను కూడా ఇవ్వాలని మరో సమావేశంలో చిరంజీవి కోరారు.

ఇక ఇపుడు ఆయన ఏపీలో సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను పెంచమని ఏకంగా జగన్ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా కోరారు. ఆయన అందులో లేవనెత్తిన అంశాలు కూడా బాగానే ఉన్నాయని అన్న వారున్నారు. ఎందుకంటే జీఎస్టీ దేశవ్యాప్తంగా ఒక్కటే రేటు ఉన్నపుడు టికెట్ల ధరలు కూడా అలాగే ఉండాలన్నది మెగాస్టార్ విన్నపం. మరి దీని మీద జగన్ సర్కార్ ఏం చేస్తుంది అన్నదే చూడాలి. అయితే మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇక చిరంజీవి సహజంగానే మెత్తని మనిషి. ఆయన ఎవరినీ నొప్పించకుండా సూచనలు చేస్తారు. ఆయన పెద్దరికం కోసం ఇలా చేస్తున్నారు కొందరైతే ఆయన కఠినంగా ఉండాలి. ప్రభుత్వ వర్గాలను డిమాండ్ చేయలని కోరుకున్న వారూ ఉన్నారు. మొత్తానికి చిరంజీవి స్వభావం అయితే అది కాదు, ఆయన మంచితనంతోనే సలహాలు సూచనలు ఇస్తారు, సినీ ప్రముఖుడిగా అయినా చిరంజీవి చెప్పిన మాటలను పాలకులు గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చిరంజీవి అంటే ముఖ్యమంత్రి జగన్ కి గౌరవం అని మంత్రి పేర్ని నాని తరచూ చెబుతూంటారు. మరి ఇపుడు మెగాస్టార్ మాటను జగన్ సర్కార్ వింటుందా. టికెట్ల రేట్ల దగ్గర టాలీవుడ్ తో ఏర్పడిన గ్యాప్ కి ఫుల్ స్టాప్ పడుతుందా. వేచి చూడాలి మరి.