వశిష్ఠ్ కూడా మరో అనిల్ రావిపూడి అవుతాడా?

Wed Aug 17 2022 23:00:01 GMT+0530 (IST)

Will Vashishth also become another Anil Ravipudi?

అనిల్ రావిపూడి.. ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో ఖచ్చితంగా అనిల్ రావిపూడి పేరు ఉంటుంది. బ్రేకుల్లేని హిట్స్ తో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన.. కెరీర్ స్టార్టింగ్ లో మాత్రం ఎన్నో స్ట్రగ్గుల్స్ ను ఫేస్ చేశారు.రైటర్ గా సినీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి.. డైరెక్టర్ గా తొలి సినిమాను తెరకెక్కించేందుకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి తరుణంలో నందమూరి కళ్యాణ్ రామ్ ధైర్యం చేసి ఆయనకు మొదటి అవకాశాన్ని ఇచ్చారు. అలా వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రమే 'పటాస్'. 2015లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కళ్యాణ్ రామ్ ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అలాగే అనిల్ రావిపూడి 'పటాస్'తో అందరి చూపులను తనవైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడీయన స్టార్ డైరెక్టర్ హోదాను అనుభవిస్తున్నాడు అంటే ఒక విధంగా కళ్యాణ్ రామ్ కారణమనే చెప్పాలి. ఇకపోతే 'పటాస్' తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్.. రీసెంట్ గా 'బింబిసార'తో ప్రేక్షకులను పలకరించాడు.

ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు కళ్యాణ్ కెరీర్‌లోనే బింబిసార అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మల్లిడి వశిష్ఠ్ అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

డైరెక్టర్ గా అనుభవం లేని వ్యక్తి పైగా సోసియో ఫాంటసీ కథ అయినా సరే కళ్యాణ్ రామ్ నమ్మకంగా వశిష్ఠ్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వశిష్ఠ్.. కళ్యాణ్ రామ్ కు బిగ్ హిట్ ను అందించాడు. తొలి సినిమా అయినప్పటికీ 'బింబిసార'ను అద్భుతంగా తెరకెక్కించి విమర్శకుల నుండి ప్రశంసలు అందకున్నాడు.

దీంతో ఇప్పుడు ఈ కొత్త దర్శకుడితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా వశిష్ఠ్ తో సినిమా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వశిష్ఠ్ కూడా మరో అనిల్ రావిపూడి అవుతాడంటూ సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే వశిష్ఠ్ అనిల్ రావిపూడి మాదిరి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడా..లేదా.. అన్నది చూడాలి.