'ఉప్పెన' సరికొత్త రికార్డు సృష్టించేనా?

Tue Feb 23 2021 21:00:01 GMT+0530 (IST)

Will Uppena set a new record?

ఒక సినిమా ప్రేక్షకులకు నచ్చాలంటే .. అందులో కథాకథనాలు .. మాటలు .. పాటలు .. ఇలా అన్నీ కూడా సమపాళ్లలో సర్దుకోవాలి. అప్పుడే ఆ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల మనసులకు చేరువవుతుంది. అలా అన్నితరగతుల ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టినప్పుడే ఏ సినిమా అయినా విజయవంతమవుతుంది. ఈ మధ్యకాలంలో అలా వచ్చిన సినిమాగా 'ఉప్పెన' కనిపిస్తోంది. ఈ సినిమా చూసినవాళ్లంతా తూచేసి .. కొలిచేసి ఒక ప్రేమకథా చిత్రానికి ఉండవలసిన పూర్తి లక్షణాలు ఈ సినిమాకి పుష్కలంగా ఉన్నాయని తేల్చి చెప్పారు.ఈ సినిమాకి దర్శకుడు కొత్త .. హీరో హీరోయిన్ కూడా కొత్తనే. అయినా ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అందుకు కారణం కథ .. ఆ కథలోని ఫీల్. పాత్రలు .. వాటిని జీవంతో మలిచిన తీరు అని చెప్పకతప్పదు. ఈ కారణంగానే ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తోంది. లాభాలబాటలో అలసట లేకుండా పరుగులు తీస్తోంది. ఆ తరువాత కొత్త సినిమాలు థియేటర్లలోకి భారీ సంఖ్యలో దిగినప్పటికీ అవి 'ఉప్పెన'పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అందువలన ఈ  సినిమా ఫైనల్ రన్ లో 50 కోట్ల షేర్ ను వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక డెబ్యూ హీరో సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రాబడితే తప్పకుండా అది ఒక అరుదైన రికార్డు అవుతుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి ఈ రికార్డు దక్కనుండటం గురించి అభిమానులు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. కథ పాతదే అయినా దర్శకుడు బుచ్చిబాబు ట్రీట్మెంట్ .. పాత్రల ద్వారా ఆయన పలికించిన ఫీల్ .. ప్రేమికుల మనసులోని భావాలను అందంగా ఆవిష్కరించిన పసందైన పాటలు .. కృతి శెట్టి గ్లామర్ .. వైష్ణవ్ తేజ్ - విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. మరి అంతా అనుకుంటున్నట్టుగా 'ఉప్పెన' అరుదైన రికార్డును అందుకుంటుందేమో చూడాలి.