రాజకీయాల్లోకి సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో!

Wed Jan 25 2023 10:03:56 GMT+0530 (India Standard Time)

Will Sudheer Babu join politics?

ఘట్టమనేని కుటుంబం నుంచి సూపర్ స్టార్ కృష్ణ సినీరంగాన్ని ఏల్తూనే అప్పట్లో  రాజకీయాల్లో రాణించారు.  రాజీవ్ గాంధీ నాయకత్వంలో నాడు కాంగ్రెస్ లో చేరారు. 1989 ఎన్నికలలో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి సీటు గెలుచుకున్నారు. ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో శిఖరాగ్రంలో ఉన్నప్పుడు కృష్ణ చేరిన సమయంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ కు కూడా నాయకత్వం వహించారు.అదే సమయంలో ఏపీ ఎన్నికల్లో 71 వేల ఓట్ల తేడాతో టీడీపీ అధికార ఎంపీ బొల్లా బుల్లిరామయ్యపై సూపర్ స్టార్ కృష్ణ విజయం సాధించారు. అయితే బుల్లిరామయ్య చేతిలో 1991 ఎన్నికలలో 47000 ఓట్ల తేడాతో కృష్ణ ఓడిపోయారు. అదంతా గత చరిత్ర అనుకుంటే వర్తమానంలో ఘట్టమనేని కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు ఎవరున్నారు? అన్న చర్చా సాగుతోంది.

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటారు. మరోవైపు మహేష్ బాబు బావగారు గల్లా జయదేవ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆయన తేదేపా నాయకుడు. ఇక సీనియర్ నరేష్ కేవలం మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వరకే పరిమితం. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నా కానీ రియల్ పొలిటికల్ వార్ లో ఆయన లేరు. నటుడిగా కెరీర్ ని ముందుకు నడిపిస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ భవిష్యత్ లో రాజకీయాల్లోకి వచ్చే వీలుందా? అంటే అందుకు ఆస్కారం కనిపించలేదు. కొరటాల 'భరత్ అనే నేను' సినిమాలో యాథృచ్ఛికంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించినా కానీ అది కేవలం సినిమాటిక్ మాత్రమే. నటుడిగా మహేష్ కెరీర్ ఇటీవల అత్యున్నత స్థానానికి రీచ్ అయింది. ఇప్పుడు రాజమౌళి నిర్ధేశనంలో పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్  స్టార్ గా అవతరించనున్నాడు. అటు పైనా మహేష్ సుదీర్ఘ కాలం నటుడిగా కొనసాగేందుకే ఆసక్తిగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన అతడికి ఇప్పట్లో లేదు. దానికంటే ఇతర వ్యాపార రంగాల్లో రాణించేందుకు నమ్రతతో కలిసి పక్కా ప్రణాళికలను కలిగి ఉన్నారు.

అయితే మహేష్ బాబు చిన్న బావగారైన సుధీర్ బాబు రాజకీయాల్లోకి వస్తారా? అంటే .. అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'వస్తాను' అని సమాధానమిచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ బాటలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తొలుత 'అవును రాజకీయాల్లోకి వస్తాను' అనేసిన సుధీర్ బాబు ఇంతలోనే ఖంగు తిన్నాడు. రాజకీయాల్లోకి సుధీర్ బాబు.. అంటూ (హెడ్ లైన్స్) ఏసేస్తారాండీ? అంటూ కంగారు పడ్డాడు.

అది కేవలం ఏదో అనేశాను అంతే అంటూ మాటను వెనక్కి తీసుకున్నాడు. తాను సినిమాల్లోకి రావడం కూడా యాథృచ్ఛికమేనని అప్పటి పరిస్థితుల్లో  సినీకెరీర్ ని ఎంపిక చేసుకున్నానని కూడా సుధీర్ బాబు తెలిపాడు. హీరో అవ్వాలన్న కోరిక తనకు ఎప్పుడూ లేదని పరిస్థితులే రప్పించాయని అన్నాడు. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అనేది కూడా పరిస్థితులే నేర్పిస్తాయనే అతడి ఉద్ధేశం బయటపడింది. సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ బండిని సజావుగా ముందుకు సాగించే పనిలో ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.