Begin typing your search above and press return to search.

సాయిప‌ల్ల‌వి క్విట్.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

By:  Tupaki Desk   |   25 Nov 2022 11:30 AM GMT
సాయిప‌ల్ల‌వి క్విట్.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత‌?
X
ట్యాలెంటెడ్ న‌టి సాయిప‌ల్ల‌వి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ టాలీవుడ్ లో హ‌వా సాగిస్తోంది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఆఫ‌ర్ల‌కు కొద‌వేమీ లేదు. ఇండస్ట్రీ నుండి గ్యాప్ అన్న‌దే లేకుండా వ‌రుస‌ ఆఫర్లు వస్తున్నాయి.. కానీ ఏ ఒక్కటీ అంగీకరించడం లేదు. దీంతో ఇప్పుడు సాయిప‌ల్ల‌విపై ఒక కొత్త రూమ‌ర్ పుట్టుకొచ్చింది. సాయిప‌ల్లవి ఇక సినిమాల్లో న‌టించ‌దు. తాను ఎంబీబీఎస్ డాక్ట‌ర్ కాబ‌ట్టి ఇక సొంతంగా ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ ప్ర‌ణాళిక‌ల్లో ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు వైద్యం చేస్తూ ఆ వృత్తిలోనే సంతృప్తిని వెతుక్కోబోతోంద‌నేది తాజా ప్ర‌చారం. అయితే ఇందులో నిజం ఎంత‌? న‌మ్మేదెలా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

దక్షిణాదిలో అత్యంత అద్భుతమైన ప్ర‌తిభావ‌నిగా ఇప్ప‌టికే సాయిప‌ల్ల‌వి క్రేజ్ స్కైలో ఉంది. నిజానికి సాయిప‌ల్ల‌వి ఏ సినిమాలో న‌టిస్తే ఆ సినిమాకి త‌నే ప్ల‌స్. ఫ్లాపుల్లో ఉన్న‌ హీరోల‌కు కూడా స‌క్సెస్ ని అందిస్తూ త‌న రేంజు ఏంటో చూపిస్తోంది. అంతేకాదు.. నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తోను స‌త్తా చాటే అరుదైన‌ ప్ర‌తిభావ‌నిగా గుర్తింపు తెచ్చుకుంది. వీట‌న్నిటినీ మించి గొప్ప డ్యాన్సర్ గా కొరియోగ్రాఫ‌ర్ గా కూడా సాయిప‌ల్ల‌వికి అద్భుత క్రేజ్ ఉంది.

అయితే ఇంత‌లోనే .. కెరీర్ పీక్ లో ఉండ‌గా ప‌రిశ్ర‌మ నుంచి విర‌మిస్తోంద‌నేది జీర్ణించుకోలేనిది. సినీ పరిశ్రమలో త‌న‌దైన‌ ముద్ర వేసిన ఈ బ్యూటీ ఇక న‌టించ‌దు! అనేది అభిమానుల్లో క‌ల్లోలం రేపుతోంది. తన కెరీర్ లో ఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలోనే అసాధార‌ణంగా అభిమానులను సొంతం చేసుకుంది. సాయిప‌ల్ల‌వి 2015లో మలయాళ చిత్ర పరిశ్రమలో నటనా ఆరంగేట్రం చేసింది. ఆ త‌ర‌వాత తెలుగు ప‌రిశ్ర‌మ‌కు 'ప్రేమ‌మ్' చిత్రంతో ప‌రిచ‌య‌మైంది. అప్పటి నుండి కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసుకోలేదు.

సాయి పల్లవి ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పాపుల‌ర్ నాయిక‌ల్లో ఒకరిగా ఎదిగింది. అయితే తాజాగా సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటోంద‌న్న క‌థ‌నాలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. తెలుగు మీడియా స‌హా ఇత‌ర మీడియాల్లోను ఇటీవ‌ల సాయిప‌ల్ల‌విపై తామ‌ర‌తంప‌ర‌గా ఇలాంటి క‌థ‌నాలు వెలువడుతూనే ఉన్నాయి.

అయితే దీనికి కార‌ణం లేక‌పోలేదు. సాయి పల్లవి తన గత చిత్రాలైన విరాటపర్వం - గార్గి రిలీజైన‌ తర్వాత స్టార్ హీరోల సరసన అనేక ఆఫర్లను తిరస్కరించింది. దీంతో ఈ బ్యూటీ త్వరలో వినోద ప్రపంచానికి వీడ్కోలు పలుకుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్ప‌టికీ సాయి పల్లవికి అనేక ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆమె ఆసుపత్రిని నిర్మించాలనే తన మిషన్ పై పూర్తిగా దృష్టి సారించినందున వాటిలో దేనినీ అంగీకరించలేదు.

MBBS డాక్ట‌ర్ మిష‌న్ ఇది అనేది ఎంద‌రికి తెలుసు?

సాయి పల్లవి ఒక ప్ర‌తిభావంత‌మైన క‌థానాయిక‌గా అభిమానుల గుండెల్లో నిలిచి ఉంది. కానీ అంత‌కుముందే తాను ఒక ఎంబీబీఎస్ డాక్ట‌ర్. 2016లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా- జార్జియాలోని మెడికల్ స్కూల్ నుండి తన MBBS డిగ్రీని అందుకుంది.

తాజా క‌థ‌నాల ప్రకారం సాయి పల్లవి ఇప్పుడు కోయంబత్తూరులో తన సొంత ఆస్ప‌త్రిని నిర్మించడంపై ఎక్కువ దృష్టి పెడుతోంది. సాయి పల్లవి తన కెరీర్ ని పూర్తిగా ఆస్ప‌త్రి నిర్వ‌హ‌న‌కే అంకిత‌మిస్తుంద‌ని ఊహిస్తున్నారు. నటన నుండి వైద్య సేవ‌ల‌కు పూర్తిగా ఆలోచ‌న‌ను మార్చుకున్నట్లు ఈ బ్యూటీ స్వ‌యంగా ధృవీకరించక‌పోయినా మీడియా ప్ర‌చారంతో ప్ర‌జ‌ల్లో ఊహాగానాలు సాగుతున్నాయి.

సాయిప‌ల్ల‌వి నిర్మించే భారీ ఆసుపత్రిని త‌న‌ సోదరి పూజా కన్నన్ నిర్వహిస్తారని సమాచారం. ఒక‌వేళ ఆస్ప‌త్రి నిర్మాణం పూర్త‌యిన అనంత‌రం తిరిగి సాయిప‌ల్ల‌వి నటిగా త‌న కెరీర్ ని య‌థావిధిగా కొన‌సాగించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కేవ‌లం ఒక భారీ మిష‌న్ ని విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం కోసం బ‌హుశా గ్యాప్ తీసుకుని ఉండొచ్చు. ఓవైపు ఆస్ప‌త్రి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు త‌న సోద‌రితో క‌లిసి చూస్తున్నా.. న‌ట‌న‌కు అడ్డంకులేవీ ఉండ‌వు. ప్ర‌స్తుతానికి క్రేజీ న‌టిగా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకుంటోంద‌ని భావించాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.