'అరణ్య'తో ప్రభు సాల్మన్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..??

Sat Mar 06 2021 07:00:01 GMT+0530 (IST)

Will Prabhu Salmon magic be repeated with Aranya?

సినీ ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో విజన్ ఉంటుంది. అలాగే సినిమా మేకింగ్ లో ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఈ రెండింటితో పాటు ముఖ్యంగా కొన్ని సిగ్నేచర్ మార్క్స్ ఉంటాయి. వాటిని దర్శకుడు తను తెరకేక్కించే ప్రతి సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే అవసరమైతే సినిమా కథను కూడా తన టేస్ట్ తను నమ్మిన మార్క్ మిస్ అవ్వకుండా మార్పులు చేసుకోగలడు. తెలుగులో చాలామంది దర్శకులకు గోదావరి నది అంటే మక్కువ సినిమాలో ఎక్కడో ఓ చోట గోదావరిని చూపిస్తారు. అలాగే కొందరు దర్శకులు కట్టడాలను కొందరు పచ్చని పొలాలను ఇంకొందరు ఫారెన్ లొకేషన్స్ చూపిస్తూ ఉంటారు. అలాంటి టేస్ట్ విజన్ కలిగిన డైరెక్టర్లలో ఒకరు తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్.ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాలో కామన్ గా కనిపించేది ప్రకృతి అడవులు. ఈ రెండు లేకుండా ప్రభు ఇంతవరకు సినిమాలు తీయలేదు. సినిమా మొత్తం కాకపోయినా కనీసం ఓ పాటనైనా అడవిలో పచ్చని ప్రకృతి ఒడిలో చిత్రికరించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే అడవి నేపథ్యంలో సినిమాలు రూపొందించే అరుదైన దర్శకులలో ప్రభు ఒకరు. తాజాగా ఆయన నుండి అరణ్య అనే సినిమా రాబోతుంది. స్టార్ హీరో రానా ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా విడుదల చేసిన అరణ్య ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. మనుషులు తమ స్వార్థం కోసం అడవులను అడవి జంతువుల అరణ్యాలను ఎలా నాశనం చేస్తున్నారనే నేపథ్యంలో మంచి సందేశంతో తెరకెక్కింది ఈ సినిమా. ట్రైలర్ చూసినవారంతా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి మార్చ్ 26న థియేటర్లలో ప్రభు సాల్మన్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో!