Begin typing your search above and press return to search.

'పొన్నియిన్ సెల్వన్' సంచలనం సృష్టించనుందా?

By:  Tupaki Desk   |   25 Sep 2022 5:35 AM GMT
పొన్నియిన్ సెల్వన్ సంచలనం సృష్టించనుందా?
X
ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ కూడా 'పొన్నియిన్ సెల్వన్' గురించే మాట్లాడుకుంటున్నారు. సౌత్ నుంచి ప్రపంచపటాన్ని ఆక్రమించడానికి సిద్ధమవుతున్న సినిమా ఇది. 1000 సంవత్సరాల క్రితం 'రాజరాజ చోళుడు' పాలనా కాలంలో జరిగిన కథ ఇది. తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తమిళంలో రికార్డు స్థాయి సేల్స్ చూసిన నవల ఇది. చోళరాజుల పౌరుషం .. పరిపాలనా తీరు .. పాండ్య రాజులతో జరిగే యుద్ధమే ఈ కథ.

ఇది అంత ఆషామాషీ చరిత్ర కాదు .. చాలా సుదీర్ఘమైనది. రాజులు .. రాజ్యాలు .. తరాలవారీగా చూపించవలసి ఉంటుంది. అందువలన పాత్రల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆనాటి సెట్స్ కోసం అయ్యే ఖర్చు మామూలుగా ఉండదు. అందువల్లనే ఈ కథను ఇప్పటివరకూ టచ్ చేయడానికి ఎవరూ సాహసించలేదు. అప్పట్లోనే ఎంజీఆర్ ట్రై చేసినా కుదరలేదు. అంతెందుకు తన కెరియర్ ఆరంభం నుంచే మణిరత్నం మనసు పారేసుకున్న కథ ఇది. కానీ బడ్జెట్ కారణంగా .. భారీ తారాగణం కారణంగా అది ఇప్పటివరకూ కుదరలేదు.

భారీ చిత్రాల నిర్మాణానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన లైకా వారు రంగంలోకి దిగడం వలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఎందుకంటే ఇంతకుముందు ఈ సినిమా చేయడానికి మణిరత్నం రెండు మూడు మార్లు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు.
ఈ సినిమాలో ప్రధానమైనవిగా చెప్పుకునేవి 15 పాత్రల వరకూ ఉంటాయి. ఆ పాత్రలను స్టార్స్ తోనే చేయించాలి. అందరి డేట్స్ కుదరాలి .. వారి పారితోషికాలను తట్టుకోగలగాలి. ముఖ్యంగా ప్రతి పాత్రకి ప్రత్యేకమైన లుక్ కావాలి .. అందుకు అవసరమైన డిజైనింగ్ ఉండాలి. దీని కోసమే మణిరత్నం ఎక్కువ సమయాన్ని తీసుకోవలసి వచ్చింది.

అలాంటి ఒక సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసే అన్ని భాషల్లోను ప్రమోషన్స్ ను కవర్ చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాపై బజ్ మామూలుగా లేదు. ఇక అమెరికాలోను విపరీతమైన బజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 5 రోజుల ముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్క్ వసూళ్లను సాధించడం విశేషం. ప్రీమియర్స్ పడే సమయానికి 1.5 మిలియన్ మార్కును టచ్ చేయవచ్చని అంటున్నారు.

అయితే తమిళ వెర్షన్ కి సంబంధించిన హైప్ తెలుగు .. హిందీ భాషల్లో కనిపించడం లేదు. తెలుగు విషయానికి వస్తే టైటిల్ ఎఫెక్ట్ బాగా ఉందనే టాక్ ఉంది. ఇక దీనిని 'బాహుబలి'తో పోల్చుకుంటున్నారు. 'బాహుబలి' కల్పిత కథ కనుక రాజమౌళికి స్వేచ్ఛ ఉంటుంది. మణిరత్నం తీసుకున్న కథ వాస్తవానికి దగ్గరగా ఉన్నది. పైగా నవలగా అక్కడ అందరికీ తెలిసింది. ఆ పరిధి దాటకుండా ఆయన ఎలా ముందుకు వెళ్లారనేది ఆసక్తి కరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమనే మాట మాత్రం బలంగానే వినిపిస్తోంది. సౌత్ నుంచి వెళుతున్న మరో సంచలనంగా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి.