మన హీరోలు 'పాన్ ఇండియా స్టార్స్' అనిపించుకుంటారా...?

Thu Jul 16 2020 09:15:09 GMT+0530 (IST)

Do our heroes look like 'Pan India Stars' ...?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ మార్కెట్ ని విస్తరించుకునే ఉద్దేశ్యంతో ఇతర భాషల్లో కూడా తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా తమ చిత్రాలు రిలీజ్ చేసి మార్కెట్ చేసుకోవాలని హీరోలందరూ భావిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ తీస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఆశ పడుతున్నారు. అందుకే క్రేజ్ తో ఇమేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేస్తున్నారు. నిజానికి అప్పట్లో నాగార్జున చిరంజీవి వెంకటేష్ ఇతర భాషల చిత్రాల్లో నటించారు. అయితే ఆ తర్వాతి తరం హీరోల్లో ఎవరూ సాహసం చేయలేదు. చేసినా సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే 'బాహుబలి' సినిమా తర్వాత సీన్ మారిపోయింది. సినిమాకి భాషతో సంబంధం లేదంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని కొన్నేళ్ల పాటు ఎవరూ టచ్ చేయని రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కాస్తా 'పాన్ ఇండియా స్టార్' గా మారిపోయాడు. అంతేకాకుండా 'సాహో' సినిమాతో అది నిలబెట్టుకున్నాడు కూడా. దీంతో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ అనౌన్స్ చేస్తున్నారు.కాగా వచ్చే ఏడాది టాలీవుడ్ నుండి కొన్ని పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' తో ఇతర ఇండస్ట్రీలలో అడుగుపెట్టబోతున్నారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కి ప్లాన్ చేసారు. 'సర్ధార్ గబ్బర్ సింగ్'తో ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతి సినిమా ఇకపై పాన్ ఇండియా లేవల్లోనే ప్లాన్ చేస్తున్నారు. 2021లో రిలీజ్ కానున్న 'రాధే శ్యామ్' కూడా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' పాన్ ఇండియా మూవీనా కాదా అనే దానిపై క్లారిటీ లేదు. మొత్తం మీద టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ 2021లో పాన్ ఇండియా మూవీస్ తో బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకోగా.. వీరిలో ఎవరు బాలీవుడ్ లో కూడా సత్తా చాటి ఆ గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.