స్మార్ట్ పోరిని ఇప్పటికైనా గుర్తిస్తారా ?

Sat Jul 20 2019 11:14:40 GMT+0530 (IST)

మూడు రోజుల క్రితం విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మాస్ ప్రేక్షకుల అండతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. మొదటి రోజు రామ్ కెరీర్ బెస్ట్ రికార్డు కావడంతో పాటు వీకెండ్ మొత్తం తన కంట్రోల్ లోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నడూ చూడని పవర్ ఫుల్ ఎనర్జీతో రామ్ మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు కానీ హీరోయిన్లు ఇద్దరు ఉన్నా ఎక్కువ మార్కులు పడింది మాత్రం చాందినిగా నటించిన నభా నటేష్ కే.ఊర మాస్ నాటు పాత్రలో రామ్ ని తిడుతూ కొడుతూ ఇంకా చెప్పాలంటే బూతులు వాడుతూ అతి పిచ్చి ప్రేమలో మునిగిపోయే అమాయక చాందినిగా నభాకు మంచి మార్కులే పడ్డాయి. కాకపోతే పాత్ర నిడివి నిధి అగర్వాల్ తో పోలిస్తే కొంత తక్కువగా అనిపించినప్పటికీ ఆ లోటు ఎక్కువగా తెలియనివ్వకుండా పాటలు ఫ్లాష్ బ్యాక్ ట్రాక్స్ తో పూరి మానేజ్ చేయడం బాగా ప్లస్ అయ్యింది

ఇప్పుడు నభ నటేష్ కు ఎలాంటి అవకాశాలు వెల్లువెత్తుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సాఫ్ట్ వెర్ ఇంజనీర్ సిరిగా అల్లరి చేసిన నభకు అందులోనే మంచి పేరు వచ్చింది. కాకపోతే ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్లలేకపోవడంతో తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో విశ్వరూపం చూపించేసింది కాబట్టి ఇకపై దర్శక నిర్మాతలకు తనో మంచి ఛాయస్ గా నిలిచే అవకాశం లేకపోలేదు. రవితేజ డిస్కో రాజాలో కూడా ఇలాంటి పాత్రే అయితే మాస్ సినిమాలకు నభ కేరాఫ్ అడ్రెస్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు