కేసీఆర్ జూనియర్ ఆర్టిస్టుల గోడు వింటారా?

Sun Jul 12 2020 11:40:00 GMT+0530 (IST)

Will KCR Solve Junior Artists Problems

కరోనా మహమ్మారీ హైదరాబాద్ ని అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. మెట్రో నగరంలో స్థిరపడిన సినిమావాళ్లను మరింతగా అల్లాడిస్తోంది. సినీకార్మికులు అధికంగా నివశించే యూసఫ్ గూడ - కృష్ణానగర్ బెల్టులోనే ఏకంగా వందలాది పాజిటివ్ కేసులు నమోదవ్వడం భయపెట్టేస్తోంది. ఫిలింనగర్- ఇందిరా నగర్ సహా టీవీ ఆర్టిస్టులు మీటింగులు పెట్టే గణపతి కాంప్లెక్స్ లోనూ పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆ చుట్టుపక్కల తిరిగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిసరాల్లో ఎటు చూసినా సినీకార్మికులే దర్శనమిస్తారు.మొన్నటికి మొన్న సినీకార్మికుల నివాసం ఉండే చిత్రపురి కాలనీలోనూ కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో అంతా కలతకు గురయ్యారు. కాలనీలో హై అలెర్ట్ ప్రకటించారు. అలాగే వరుసగా టీవీ ఆర్టిస్టులు కరోనా భారిన పడుతుండడంతో ఈ టెన్షన్ ఎవరికీ కునుకుపట్టనివ్వడం లేదు. తిరిగి కోలుకునే వీలున్నా.. రికవరీ రేటు బావున్నా.. కుటుంబంలో అందరినీ మహమ్మారీ ఒకేసారి టెన్షన్ పెట్టేస్తుండడంతో ఎందుకొచ్చిన గొడవ! అనుకుంటున్నారంతా.

తాజాగా జూనియర్ ఆర్టిస్టుల వంతు. వీళ్లు యూసఫ్ గూడ మొదలు పిలింనగర్ వరకూ చాలా ఏరియాల్లో స్థిరపడి ఉన్నారు. యూసఫ్ గూడ- కృష్ణానగర్- వెంకటగిరి- జూబ్లీహిల్స్- గాయత్రి నగర్- ఫిలింనగర్- చిత్రపురి- టోలీచౌకి-మణికొండ సహా పలు ఏరియాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. అన్నిచోట్లా కరోనా విలయతాండవం ఆడుతోంది. వందలాది కేసులు టెన్షన్ పెడుతున్నాయి.

తాజాగా ఇండ్లు లేని జూనియర్ ఆర్టిస్టులు అద్దె కట్టలేని స్థితిలో రోడ్డున పడ్డామని నివేదిస్తున్నారు. తమకు కేసీఆర్ ప్రభుత్వ జమానాలో సొంత గూడు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని.. ఆ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాటిచ్చారని చెబుతున్నారు. అంతేకాదు.. అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉంటే తమను ఇంటి యజమానులు రోడ్లపైకి గెంటేస్తున్నారని వాపోతున్నారు. నాలుగు నెలలుగా ఉపాధి కరువై తిండికే లేని పరిస్థితి. బతుకు తెరువు లేదు. అద్దెకు డబ్బు ఎలా వస్తుందని వాపోతున్నారు. అంతేకాదు.. కేసీఆర్ స్వయంగా పూనుకుని ఎక్కడైనా గుడిసెలు నిర్మించి ఇచ్చినా అందులో తల దాచుకుంటామని.. కలో గంజో తాగి బతికేస్తామని నివేదిస్తున్నారు.

మరి టీ-ప్రభుత్వం జూనియర్ ఆర్టిస్టుల గోడు పట్టించుకుంటుందా?  ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఆరు నెలల నుంచి ఏడాది పైగానే మహమ్మారీ విలయం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటప్పుడు అద్దెలు చెల్లించకుండా ఆర్టిస్టులు హైదరాబాద్ లోనే ఉండటం ఎలా?  టాలీవుడ్ ని ఎటూ పోనివ్వకుండా ఆపాలంటే ముందుగా కార్మికుల్ని ఆదుకోవాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. అన్నట్టు జూనియర్ ఆర్టిస్టులకు.. అలాగే ఇండ్లు లేని టీఎంటీఏయు (తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టులు) సంఘ సభ్యులకు సొంతంగా ఇండ్లు నిర్మించి ఇస్తామని అందుకు చిత్రపురి కాలనీ పరిసరాల్లో ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని గత ఎన్నికల వేళ బీరాలు పోయిన తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తుందా ఇప్పటికైనా?