`గని` రిలీజ్ తేదీ మారుతుందా?

Wed Nov 24 2021 11:01:21 GMT+0530 (IST)

Will Gaini Release Date Change

`పుష్ప- ది రైజింగ్` చిత్రాన్ని డిసెంబర్ 17న పాన్ ఇండియా కేటగిరీలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు బన్ని బృందం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 24న శ్యామ్ సింగరాయ్ - గని చిత్రాలు పోటీపడనున్నాయి. అయితే రెండు క్రేజీ సినిమాలతో పోటీపడుతూ తమ సినిమాని రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదని `గని` టీమ్ భావిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.బాక్సింగ్ నేపథ్యంలో ప్రామిస్సింగ్ సినిమాని తీశామని భావిస్తున్న మేకర్స్ తమ సినిమాని సోలోగా విడుదల చేసుకుంటే మరింత బెటర్ రిజల్ట్ ఉంటుందని భావిస్తున్నారట. డిసెంబర్ 24న రిలీజ్ చేయాలా వద్దా? అనే డైలమా ఇప్పటికి కొనసాగుతోందనేది గుసగుస. ఒకవేళ వాయిదా వేసినా సంక్రాంతి ముందు విడుదల చేయడం కుదరదు. అప్పుడు వరుసగా పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ - రాధేశ్యామ్- భీమ్లా నాయక్ లాంటి క్రేజీ సినిమాలు బరిలో నిలిచాయి కాబట్టి సంక్రాంతి ముందు రిలీజ్ కి ఛాన్సుండకపోవచ్చని భావిస్తున్నారు. అయితే జనవరి మూడో వారంలో `గని` చిత్రాన్ని విడుదల చేసే వీలుందని ఊహాగానాలు సాగుతున్నాయి.

వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన `గని` భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కేటగిరీలో అలరించనుంది. నాని `శ్యామ్ సింగరాయ్` పూర్తిగా వైవిధ్యమైన స్క్రిప్టుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కింది. ఈ రెండిటి మధ్యా పోటీ ఉంటుందా ఉండదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

గని కోసం వరుణ్ కఠోరశ్రమ

టోన్డ్ మజిల్స్ ఉప్పొంగిన నరాలు 6ప్యాక్ రూపంతో వరుణ్ తేజ్ మేకోవర్ ఇప్పటికే ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. గని సినిమా కోసం అతడు చాలా హార్డ్ వర్క్ చేశాడని మారిన రూపం చెబుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన కొత్త లుక్ అభిమానుల్లోకి దూసుకెళ్‌లింది. ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లా మారాడు వరుణ్ తేజ్. నేటితరానికి స్ఫూర్తి నింపేలా ఈ లుక్ అదుర్స్ అన్న టాక్ వచ్చింది. గని కోసం వరుణ్ తేజ్ పూర్తిగా మేకోవర్ అయిన తీరు అబ్బురపరుస్తోంది.

కిరణ్ కొర్రపాటి రచించి దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా ఇది. రెనైసాన్స్ పిక్చర్స్- అల్లు బాబీ కంపెనీ బ్యానర్ లపై సిద్ధు ముద్దా -అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తోంది. ఈ బ్యూటీ డెబ్యూ సినిమాతో కుర్రకారు మతులు చెదరగొడుతుందని అంతా భావిస్తున్నారు. కరోనా క్రైసిస్ వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. ఎట్టకేలకు గని బాక్సాఫీస్ బరిలోకి దిగే సమయమాసన్నమైంది. ఇకపై టీమ్ ప్రచారంలో వేడి పెంచనుందని సమాచారం. బాక్సర్ గా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా వరుణ్ తేజ్ తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకోనున్న ఈ సినిమా కోసం మెగాభిమానులు సహా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నాకౌట్ పంచ్ లతో వరుణ్ ఎలాంటి ఆట ఆడతాడో చూడాలి.