సెంటిమెంట్ అంటూ బన్నీ - సుక్కు రిస్క్ చేస్తారా?

Thu May 19 2022 06:00:01 GMT+0530 (IST)

Will December sentiment hurt Allu Arjun

ఓ నెలలో సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని అందిస్తే అదే సెంటిమెంట్ గా భావిస్తుంటారు సినిమా స్టార్స్. ప్రతీ హీరోకు ఓ సెంటిమెంట్ నెల అంటూ వుంటుంది. అది దక్షిణాది స్టార్ అయినా ఉత్తరాది స్టార్ అయినా ఆ సెంటిమెంట్ కే పెద్ద పీట వేస్తుంటారు. సల్మాన్ ఖాన్ కి ఈద్ సెంటిమెంట్. ఆ టైమ్ లో సినిమా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అతని నమ్మకం. ఇక మన హీరోల్లో కొంత మందికి సంక్రాంతి సెంటిమెంట్ అయితే కొంత మందికి సమ్మర్ సెంటిమెంట్.ఇలా తమ సినిమాలని సెంటిమెంట్ టైమ్ లోనే రిలీజ్ చేస్తూ వుంటారు. బన్నీకి కూడా ఈ మధ్య ఓ సెంటిమెంట్ నెలపై మనసు పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ బన్నీ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అంతే కాకుండా బాలీవుడ్ లో రికార్డుల మోత మోగించింది. బన్నీని మొత్తానికి పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.

ఇన్ని చేసిన డిసెంబర్ నెల ఇప్పడు బన్నీకి సెంటిమెంట్ గా మారిందట. త్వరలో బన్నీ `పుష్ప 2`షూటింగ్ ని మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. జూలై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఫస్ట్ పార్ట్ కి లభించిన ఆదరణని దృష్టిలో పెట్టుకుని `పుష్ప 2` స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేశారట సుకుమార్. బడ్జెట్ ని కూడా ముందు అనుకున్న దాని కంటే భారీగా పెంచేసి 375 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ మూవీని ఫస్ట్ పార్ట్ ల హరీ బరీగా విడుదల చేయాలనుకోవడం లేదట. ప్రాపర్ గా ఐదు భాషల్లో ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించిన తరువాతే `పుష్ప2`ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా జూలైలో షూటింగ్ మొదలు పెట్టి జనవరి వరకు కంప్లీట్ చేసినా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం భారీగానే టైమ్ తీసుకోవాలనుకుంటున్నారట. ఇక తమకు అచ్చొచ్చిన డిసెంబర్ లోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.

మరీ ఇంత ఆలస్యం అయితే ఇబ్బంది కదా? అని అంటే సెంటిమెంట్ నెలలోనే `పుష్ప 2`ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బన్నీ సుక్కు బలంగా భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇది రిస్క్ కదా?. సినిమాని పూర్తి చేసి అన్ని నెలలు రిలీజ్ కోసం ఎదురుచూడటంతో ఈ విషయం తెలిసిన వాళ్లంతా మరీ ఇంత ఆలస్యంగా సినిమాని థియేటర్లలోకి తీసుకురావాలనుకోవడం రిస్క్ కదా? అని కామెంట్ లు చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.