అల్లు మూవీ అయినా అను కెరీర్‌ను నిలబెట్టేనా?

Sat Sep 24 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

Will Allu's movie sustain Anu's career?

ఆకట్టుకునే అందం మంచి టాలెంట్ ఉన్న సక్సెస్ లేని హీరోయిన్స్ లో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈ అమ్మడు తెరపై కనిపించి చాలా కాలమే అయింది. అమెరికాలో జన్మించిన ఈ బ్యూటీ 'స్వప్న సంచారి' అనే మలయాళ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'మజ్ను' మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.తొలి సినిమాతోనే తనదైన అందం అభినయం నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ మూవీ చూసిన వారు అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని భావించారు. కానీ అందరి అంచనాలను అను తలకిందులు చేసింది. 'మజ్ను' తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో జతకట్టింది.

కానీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఐరన్ లెగ్ అనే ముద్రను సైతం వేయించుకుంది. చివరిగా ఈ అమ్మడు 'మహాసముద్రం' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. శర్వానంద్ సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2021లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

మహాసముద్రం విడుదలై ఏడాది కావస్తున్నా.. అను ఇమ్మాన్యుయేల్ నుంచి మరో సినిమా రాలేదు. అయితే మళ్లీ ఇన్ని రోజులకు 'ప్రేమ కాదంట' అనే మూవీతో అలరించేందుకు సిద్ధమవుతోంది. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఇది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించాడు.

షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇక్కడో చిన్న మెలిక పెట్టారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఫస్ట్ లుక్ టీజర్ ఉంటుందని వెల్లడించారు.

ఆల్రెడీ  'ప్రేమ కాదంట' అనే టైటిల్‌ని ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల చేసిన సినిమాకి.. మళ్లీ ఇప్పుడు ఫ్రెష్‌గా ఈ ప్రకటన చేయడం కాస్త అయోమయానికి గురి చేసింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సినిమా అదే అయినా టైటిల్ మార్చి సరికొత్త కలరింగ్ ఇచ్చి విడుదల చేయబోతున్నారట. అందుకే మేకర్స్ అలా ప్రకటన చేశారని టాక్ నడుస్తోంది.

ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాపైనే అను ఇమ్మాన్యుయేల్ తన ఆశలన్నీ పెట్టుకుందట. కెరీర్ ఆరంభం నుంచి హిట్ ముఖమే చూడని అను.. ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశ పడుతోందట. మరి అల్లు మూవీ అయినా అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌ను నిలబెడుతుందా..? లేదా..? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.