Begin typing your search above and press return to search.

బన్నీ రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నాడా...?

By:  Tupaki Desk   |   12 July 2020 7:50 AM GMT
బన్నీ రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నాడా...?
X
అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి బన్నీ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇదే ఊపులో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కించేసాడు. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే 'పుష్ప' నుండి రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసింది. దీంతో బన్నీ కావాలని గ్యాప్ తీసుకోకపోయినా గ్యాప్ అయితే వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు.

కాగా ఇటీవల ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చినప్పటికీ రోజురోజుకి మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో 'పుష్ప' టీమ్ కూడా మరొకొన్ని రోజులు వేచి చూడాలని డిసైడ్ అయిందట. అందులోనూ అడవుల్లో ఎక్కువ మంది సిబ్బందితో చిత్రీకరించాల్సి ఉంటుంది కాబట్టి షూటింగ్ స్టార్ట్ చేయడానికి మరో రెండు నెలల సమయమైనా పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఖాళీ సమయం చాలా దొరకడంతో బన్నీ కొత్త కథలు వినడానికి ఈ సమయాన్ని కేటాయిస్తున్నారట. ముఖ్యంగా న్యూ కమ్మర్స్ చెప్పే స్టోరీ లైన్స్ వింటున్న బన్నీ నచ్చితే భవిష్యత్ లో సినిమా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారట.

అయితే బన్నీ డెబ్యూ డైరెక్టర్ తో వర్క్ చేసిన సందర్భాలు తక్కువ. 'ఆర్య' సినిమా కోసం సుకుమార్ తో వర్క్ చేసిన అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమాతో వక్కంతం వంశీని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసారు. అందులో ఒక సినిమా హిట్ అవ్వగా మరో సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. ఈ క్రమంలో బన్నీ డెబ్యూ డైరెక్టర్స్ కి అవకాశం ఇచ్చి ఏ మాత్రం రిస్క్ చేస్తాడో చూడాలి. కాగా గతేడాది 'ఓ మై ఫ్రెండ్' దర్శకుడు వేణు శ్రీరాంతో 'ఐకాన్' మూవీ అనౌన్స్ చేసారు బన్నీ. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కాల్సిన 'ఐకాన్' ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. 'పుష్ప' కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ 'ఐకాన్' స్టార్ట్ చేస్తాడా లేదా ఇప్పుడు వింటున్న స్టోరీలలో దేనికైనా ఓకే చేసి డెబ్యూ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.