Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చేనా??

By:  Tupaki Desk   |   24 Feb 2020 11:00 AM GMT
అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చేనా??
X
టాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన అతి తక్కువమంది కమర్షియల్ డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి ఒకరు. స్టైలిష్ టేకింగ్ తో మాస్ ఎలిమెంట్స్ ను రంగరించి హిట్ సాధించే సత్తా ఉన్న దర్శకుడు సూరి. అయితే కెరీర్ లో నిలకడ లేదని కొందరు అంటూ ఉంటారు. ఒకవైపు 'కిక్'.. 'రేసుగుర్రం' లాంటి సూపర్ హిట్లు ఉన్నప్పటికే 'అతిథి'.. 'కిక్-2' లాంటి డిజాస్టర్లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. సురేందర్ రెడ్డి లాస్ట్ సినిమా మెగాస్టార్ తో తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'సైరా'. ప్రశంసల సంగతి ఎలా ఉన్నప్పటికీ 'సైరా' లాస్ వెంచరే.

'సైరా' లాంటి ప్రాజెక్టుతో సురేందర్ రెడ్డి క్రేజ్ పెరుగుతుందని అనుకున్నారు కానీ రివర్స్ లో క్రేజ్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. సురేందర్ రెడ్డికి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పటివరకూ సెట్ కాకపోవడాన్ని దానికి ఉదాహరణ గా చూపుతున్నారు. సురేందర్ రెడ్డి 'సైరా' తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ అది వర్క్ అవుట్ కాలేదు. తర్వాత్ వరుణ్ తేజ్ తో చర్చలు కొనసాగినా ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు కదల లేదు. ఈ ఇద్దరు హీరోల తర్వాత సురేందర్ ఈసారి స్టైలిష్ స్టార్ తోనే ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

సురేందర్ రెడ్డి-అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'రేసుగుర్రం' లాంటి సూపర్ హిట్ తెరకెక్కింది. ఈ కాంబినేషన్ కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. అయితే స్టైలిష్ స్టార్ గత కొంతకాలంగా తన ప్రాజెక్టుల విషయంలో అతి జాగ్రత్తగా ఉంటున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తున్నారు. విక్రమ్ కుమార్.. లింగుస్వామి.. మురుగదాస్.. వేణు శ్రీరామ్ లాంటి చాలా మంది డైరెక్టర్ల ప్రాజెక్టులు సెట్స్ మీదకు వెళ్ళక పోవడానికి అదే కారణమని ఇండస్ట్రీ టాక్. మరి ఇలాంటి పరిస్థితులలో సురేందర్ రెడ్డి సినిమాకు అల్లు అర్జున్ వెంటనే ఓకే చెప్తాడని ఎవరూ అనుకోరు. 'సైరా' సూపర్ హిట్ అయి ఉంటే అందుకు అవకాశం ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశాలు తక్కువ ఉన్నాయని అంటున్నారు. మరి బన్నీని సూరి ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి.