ఆదిపురుష్ రెండవ వాయిదా తప్పేలా లేదు!!

Wed Jul 06 2022 11:00:01 GMT+0530 (IST)

Will Adipurush Postpone Again

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో రూపొందుతున్న భారీ మోషన్ గ్రాఫిక్స్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి నెలలు గడుస్తోంది. సినిమా కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ను అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ సంస్థలతో చేయిస్తున్నారు. అద్భుతమైన విజువల్ వండర్ గా ఆదిపురుష్ ను తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో దర్శకుడు ఓమ్ రౌత్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు అంతకు ముందు వచ్చిన సాహో సినిమా కూడా నిరాశ పర్చడంతో అభిమానులు ఆదిపురుష్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సినిమా రామాయణ ఇతివృత్తం నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. దాంతో సినిమా విడుదల అయితే ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మరోసారి తన స్థానంను పదిలపర్చుకుంటాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఆదిపురుష్ ను ప్రకటించిన సమయంలోనే 2022 సంవత్సరం ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. దాని ప్రకారం వచ్చే నెలలో సినిమా విడుదల అవ్వాలి. కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు స్వయంగా ప్రకటించారు.

సినిమా మొదటి వాయిదా సమయంలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరే సినిమా విజువల్ వండర్ గా రావడంకు కాస్త ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అనుకున్నారు. కాని తాజాగా బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ కు రెండవ వాయిదా కూడా తప్పేలా లేదు అంటున్నారు.

గ్రాఫిక్స్ వర్క్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదట. దాంతో సినిమా రెడీ అయ్యేందుకు ఇంకా ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. దాంతో సినిమా వచ్చే ఏడాది జనవరిలో కాకుండా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ అభిమానులతో పాటు ఆదిపురుష్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది బిగ్ బ్యాడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.