60 ప్లస్ హీరోలకు షూటింగుల అనుమతి ఉంటుందా?

Thu May 28 2020 06:00:02 GMT+0530 (IST)

Will 60 plus heroes be allowed to shoot?

తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగులు త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. జూన్ లోనే షూటింగులు మొదలు పెడతారనేది అందరికీ తెలిసిన విషయమే కానీ కరెక్ట్ గా ఏ తేదీ నుంచి షూటింగులు మొదలవుతాయని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  జూన్ పది నుంచి అనుమతులు ఇస్తారని ఇప్పటికే ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉంటే షూటింగుల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తుందని.. ఎవరెవరు షూటింగ్ చేస్తున్నారో ఆ వివరాలు ప్రభుత్వానికి అందించాలని అంటున్నారు.  అయితే ఒక విషయంలో ఫిలింమేకర్లకు చిక్కులు తప్పకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. అదేంటంటే మహమ్మారి కారణంగా బయట తిరగడంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు.. అరవై ఏళ్ళ వయసు పైబడిన వారు జాగ్రత్తగా ఉండాలని.. ఇంట్లోనే ఉండాలని.. బయటకు రాకూడదని ప్రభుత్వం చెప్తోంది.  అయితే మన ఫిలిం ఇండస్ట్రీ లో చాలా మంది సూపర్ సీనియర్ హీరోలు ఉన్నారు. వారందరి వయసు 60 కి పైమాటే.   తెలుగులో చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. వెంకటేష్ అందరూ 60 లలో ఉన్నారు.  ఇక తమిళంలో రజనీకాంత్.. కమల్ హాసన్ కూడా అరవైల హీరోలే.

ఒకవేళ 60 ఏళ్ళ వయసు పైబడిన వారు షూటింగులలో పాల్గొనకూడదనే నిబంధన పెడితే ఈ స్టార్ హీరోలందరూ షూటింగులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలా జరిగితే వ్యాక్సీన్ వచ్చేంతవరకూ ఈ హీరోలతో ప్లాన్ చేసిన సినిమాల షూటింగ్ జరపలేరు.  మరి ప్రభుత్వం అలాంటి కఠిన నిబంధన పెడుతుందా లేక 'మీ ఆరోగ్యం మీ బాధ్యత' అని చూసి చూడనట్టుగా వదిలేస్తుందా అనేది వేచి చూడాలి.