అల్లు శిరీష్ మూవీ టైటిల్ ఎందుకు మారింది?

Mon Sep 26 2022 11:02:37 GMT+0530 (India Standard Time)

Why has the title of Allu Sirish's movie changed?

అల్లు శిరీష్ అను ఇమ్మాన్యయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'. రాకేష్ శశి ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ABCD మూవీ తరువాత శిరీష్ నుంచి మరో సినిమా రాలేదు. తన నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లకు పైనే అవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా 'ఊర్వశివో రాక్షసివో'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా కూడా యాక్టీవ్ కనిపించని శిరీష్ ఈ మూవీతో మళ్లీ జోష్ పెంచబోతున్నాడు.జీఏ2 పిక్చర్స్ శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ బ్యానర్ ల పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ఈ మూవీకి సంబందించిన ఫొటోస్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందు ఈ మూవీకి 'ప్రేమ కాదంట' అనే టైటిల్ ని ప్రకటించారు. అదే టైటిల్ తో పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. త్వరలో నే ఈ మూవీ రిలీజ్ అంటూ ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఇటీవలే ఈ మూవీని నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసిన మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ టీజర్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు. ఆల్రెడీ  'ప్రేమ కాదంట' అనే టైటిల్ని ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల చేసిన సినిమాకి.. మళ్లీ ఇప్పుడు ఫ్రెష్గా ఈ ప్రకటన చేయడం కాస్త అయోమయానికి గురి చేసింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సినిమా అదే అయినా టైటిల్ మార్చి సరికొత్త కలరింగ్ ఇచ్చి విడుదల చేయబోతున్నారట.

అందుకే మేకర్స్ అలా ప్రకటన చేశారని టాక్ నడుస్తోంది. తాజాగా పోమవారం అనుకున్నట్టుగానే టైటిల్ ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. కొత్త టైటిల్ ని ప్రకటిస్తూనే రిలీజ్ డేట్ ని మరో సారి స్పష్టం చేశారు. ఈ సినిమా టైటిల్ ని ముందు  'ప్రేమ కాదంట' అని ప్రకటించిన మేకర్స్ తాజాగా ఆ టైటిల్ ని మార్చేసి 'ఊర్వశివో రాక్షసివో' గా ఫైనల్ చేశారు. అదే టైటిల్ తో సోమవారం కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.  అంతే కాకుండా ఈ మూవీ టీజర్ ని గురువారం 29న రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు రిలీజ్ డేట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం రిలీజ్ చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడం గమనార్హం. టైటిల్ ని ఎందుకు మార్చారన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే వుంది. లేటయింది కాబట్టే మార్చారా? .. లేక మరేదైనా కారణం వుందా అన్నది తెలియాల్సి వుంది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా తన్వీన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహిరించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.