Begin typing your search above and press return to search.

ప్రభాస్ 20 మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎందుకీ సస్పెన్స్...?

By:  Tupaki Desk   |   22 May 2020 10:30 AM GMT
ప్రభాస్ 20 మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎందుకీ సస్పెన్స్...?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో 20వ చిత్రాన్ని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'సాహో' వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌ లో నెలకొన్నాయి. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారట. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల జార్జియా షెడ్యూల్‌ ముగించుకుని ఇండియాకి వచ్చింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇప్పటికే చాలా మంది సంగీత దర్శకుల పేర్లు తెర మీదకి వచ్చాయి.

అయితే బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ మరియు నేషనల్ అవార్డు విన్నర్ అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంభందించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అమిత్ త్రివేది ఇంతకముందు తెలుగులో 'సైరా నరసింహా రెడ్డి' 'దట్ ఈజ్ మహాలక్ష్మి' 'వి' సినిమాలకి సంగీతాన్ని అందించారు. వాటిలో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' 'వి' సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. కానీ 'వి' సినిమా నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీలో తన అనుభవాలను చెప్పుకొచ్చాడట. ఈ సందర్భంగా సౌత్ ఫిలిం మేకర్స్ ని మెచ్చుకున్నాడట. సౌత్ ఫిలిం మేకర్స్ బాలీవుడ్ వాళ్ళ కంటే కొత్త ఐడియాలతో ఇన్నోవేటివ్ థాట్స్ తో ముందుకొస్తారని చెప్పుకొచ్చాడట. అంతేకాకుండా తెలుగులో 'వి', 'క్వీన్' రీమేక్ సినిమా మినహా ఎటువంటి తెలుగు సినిమాకు సంగీతం అందించడానికి ఒప్పుకోలేదని ఆయన స్పష్టం చేశారట. దీనితో ప్రభాస్ మూవీకి అమిత్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయంలో నిజం లేదని తేలిపోయింది.

అయితే ఇప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయబోతున్నాడనే విషయం ఆసక్తిగా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత చిత్రం 'సాహో' విషయంలో కూడా మొదట ఇలాంటి కన్ఫ్యూజనే ఏర్పడింది. ఈ సినిమాకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసారు. తనిష్క్ బాఘ్చి, గురు రంధ్వా, బాద్షా, శంకర్ ఎషాన్ లాయ్ సాంగ్స్ అందించగా జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. ‘సాహో’ మాదిరే నాన్చి నాన్చి చివర్లో ఎవరో ఒకరితో హడావుడిగా పని చేయించి పాటల్ని చెడగొడతారేమో అన్న ఆందోళన ప్రభాస్ అభిమానుల్లో వ్యక్తమవుతోందట. ఇలాంటి నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ మ్యూజిక్ విషయంలో ఎందుకు నెగ్లెట్ చేస్తున్నారో అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని టాక్ నడుస్తోంది. అంటే సంగీతానికి నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని కంఫర్మ్ చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.