'నానీస్ గ్యాంగ్ లీడర్' తరువాత కనిపించని శరణ్య!

Fri Jun 18 2021 05:00:01 GMT+0530 (IST)

Why No Movie Offers For Saranya

శరణ్య మంచి నటి .. పాత్ర ఏదైనా సహజత్వంతో దానిని ఆవిష్కరించడం ఆమె ప్రత్యేకత. తమిళంలో మణిరత్నం - కమల్ కాంబినేషన్లోని 'నాయకన్' సినిమా ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి నటిగా ఆమె వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తమిళ .. మలయాళ భాషల్లో కొన్ని సినిమాల్లో కథానాయికగా అలరించిన ఆమె ఆ తరువాత తన వయసుకు తగిన పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. ఆ మధ్య వచ్చిన 'రఘువరన్ బీటెక్' .. 'కొలమావు కోకిల' సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు ఆమె కెరియర్లోనే చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి.  'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తల్లి పాత్ర ద్వారా శరణ్య తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు. ఆ తరువాత తెలుగు సినిమాల్లోను ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' సినిమాలోను ఆమె ముఖ్యమైన పాత్రను పోషించారు. ఇక 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలోను వరలక్ష్మి పాత్రలో సందడి చేశారు. లక్ష్మీ తరువాత ఆ స్థాయిలో శరణ్య ఆకట్టుకున్నారు. విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఫరవాలేదనిపించుకుంది. ఈ సినిమా తరువాత శరణ్య ఇక్కడ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

కరోనా మొదలైన తరువాత చూసుకుంటే ఆమె చేతిలో తమిళ సినిమాలు కనిపిస్తున్నాయిగానీ తెలుగు ప్రాజెక్టులు మాత్రం లేవు. లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి వెళ్లిన సినిమాల్లోగానీ .. ఇటీవల మొదలైన ప్రాజెక్టులలోగాని శరణ్య పేరు కనిపించడం లేదు .. వినిపించడం లేదు. ఏ పాత్ర ఇచ్చినా శరణ్య అల్లుకుపోతారు .. అలుముకుపోతారు. ఆ పాత్రకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తారు. అలాంటి శరణ్యకి తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయా? లేదంటే తమిళంలో బిజీగా ఉండటం వలన తెలుగులో చేసే అవకాశం లేదా? అనేది అర్థం కావడం లేదు.