మెగా ఫ్యామిలీ హీరోస్.. ఒకరంటే మరొకరికి పడటం లేదా!

Tue Jan 14 2020 09:00:01 GMT+0530 (IST)

Why Mega Family Heroes Not Supporting Each Other

బయటేమో వాళ్లందరినీ మెగా ఫ్యామిలీగానే ట్రీట్ చేస్తారు. మెగా హీరోలుగానే వారిని గుర్తిస్తారు. మెగాస్టార్ చిరంజీవి అనే చెట్టుకింద ఎదిగిన వాళ్లే వాళ్లంతా అందులో సందేహం లేదు. చిరంజీవి ట్రేడ్ మార్క్ లేకపోతే వీళ్లలో ఎంతమంది హీరోలుగా రాణించగలిగే వాళ్లు అంటే కూడా సమాధానం చెప్పడం కష్టం ఏమీ కాదు. వీళ్లకంటే ప్రతిభావంతులు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారికి లేని అవకాశం వీళ్లకు వచ్చింది. ఒకే చెట్టుపేరు చెప్పి ఎంతో మంది వచ్చారు. వారందరినీ ఎంతో కొంత సినీ ప్రేక్షకులు ఆదరించారు.అయితే అలా డజను నంబర్ చేరువ అవుతున్న ఈ హీరోలకు ఇప్పుడు ఒకరంటే మరొకరికి అంత పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతా సన్నిహితులే అంతా బంధువులే. అయితే వీరిలో వీరికి మాత్రం అంత సానుకూల బంధం మాత్రం కనిపించడం లేదు. అది ఒకరి సినిమా ప్రమోషన్ కు మరొకరు సహరించుకోవడంలో కనిపిస్తూ ఉంది.

అల్లు అర్జున్ సినిమా సంక్రాంతి పండగకు వచ్చింది. మరి ఇంతకీ ఎంతమంది  మెగా హీరోలు ఈ సినిమా గురించి ఒక చిన్న పాటి ట్వీట్ చేశారు? ప్రత్యేకంగా ఈ సినిమా ప్రమోషన్ కోసం రానక్కర్లేదు. ఇది సోషల్ మీడియా యుగం.. ఒక ట్వీట్ కు ఎంతో విలువ ఉండనే ఉంటుంది. అల్లు అర్జున్ సినిమా విడుదల నేపథ్యంలో రామ్ చరణ్ ఒక ట్వీట్ వేసి ఉండాల్సింది. అయితే అలాంటిది ఏమీ జరగలేదు!

కేవలం రామ్ చరణ్ అల్లు అర్జున్ ల మధ్యనే కాదు.. మిగతా వారిలో కూడా ఒకరికీ మరొకరికి మధ్యన బంధం అంతగా కనిపించడం లేదు. ఒకరి సినిమా వస్తోందంటే.. తమ వాడి సినిమా వస్తోందంటూ మరొకరు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి రావడం లేదని మెగాభిమానులు వాపోతూ ఉన్నారు. ఈ ఆవేదన అంతా ప్రధానంగా అభిమానులదే.

మరోవైపు ఆ అభిమానుల్లో కూడా చీలిక వస్తూ ఉంది. గతంలో మెగాభిమానులు అనే వారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలోని ఏ హీరోకి ఆ హీరోకి ప్రత్యేకంగా అభిమానగణం ఏర్పడుతూ ఉంది. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరోని ట్రోల్ చేసే పరిస్థితి కూడా వచ్చేసినట్టుగా ఉంది. వీరందరూ చెప్పుకునేది చిరంజీవి పేరునే అయినా..ఎవరికి వారు వేరయిపోయిన వైనం మాత్రం స్పష్టం అవుతూ ఉందని పరిశీలకులు అంటున్నారు. ఈ విషయంలో అభిమానులు ఆవేదన చెందుతూ ఉన్నారు.  మరి ఈ కథ ఇంకా ఎంత వరకూ వెళ్తుందో!