యష్ 'కేజీఎఫ్ 3' లో ఎవరా బాలీవుడ్ స్టార్?

Sun May 29 2022 08:00:01 GMT+0530 (IST)

Who is the Bollywood star in KGF3

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` 2018లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టించింది. కన్నడ సినిమా సత్తాని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తరువాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం `కేజీఎఫ్` కు సీక్వెల్ గా `కేజీఎఫ్ చాప్టర్ 2` విడుదలైంది. చాప్టర్ 1 సంచలన విజయంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో `కేజీఎఫ్ 2` వుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్ 14న భారీ అంచనాల మధ్య ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ ల పరంగా పలు రికార్డుల్ని బద్దలు కొట్టింది. మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో బాలీవుడ్ క్రేజీ చిత్రాల రికార్డుల్ని తుడిచి పెట్టింది. బుక్ మై షోలో `బాహుబలి`ని అధిగమించి ఆల్ టైమ్ రికార్డ్ ని నెలకొల్పింది. ఇప్పటి వరకు అత్యధిక టికెట్ లు అమ్ముడు పోయిన సినిమాగా `కేజీఎఫ్ 2` సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

ఇండియా వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకులు థియేటర్లలో చూసిన సినిమాగా రికార్డుని దక్కించుకున్న కేజీఎఫ్ బుక్ మై షో రికార్డుతో మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

ఇప్పటి వరకు ఈ రికార్డ్ `బాహుబలి` ఖాతాలో వుంది. అయితే తాజాగా అది `కేజీఎఫ్ 2` ఖాతాలో చేరింది. అయితే కలెక్షన్ ల పరంగా మాత్రం `బాహుబలి 2` రికార్డు ఇప్పటికీ `కేజీఎఫ్ 2` టచ్ చేయకపోవడం గమనార్హం.  వసూళ్లు పరంగా `కేజీఎఫ్ 2` ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 1200 కోట్లని అధిగమించి సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.

ఇదిలా వుంటే ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీని తరువాత `కేజీఎఫ్ 3` కూడా వుంటుందని సినిమా ఎండింగ్ లో దర్శకుడు హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ పార్ట్ 3 ని కూడా మేకర్స్ ప్రారంభించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. ఈ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని మేకర్స్ ఇటీవల సంప్రదించారని చర్చ జరుగుతోంది.

అయితే ఈ వార్తలపై నిర్మాత విజయ్ కిరగందూర్ స్పందించారు. `కేజీఎఫ్ 3` ఈ ఏడాది వుండదని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ మూవీ కోసం తాము ప్రత్యేక ప్లాన్ ని సిద్ధం చేసుకుంటున్నామని ప్రశాంత్ నీల్ ప్రస్తుతం `సలార్` షూటింగ్ లో బిజీగా వున్నారని యష్ కూడా కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించాలనే ఆలోచనలో వున్నారని స్పష్టం చేశారు. అంతే కాకుండా `కేజీఎఫ్ 3` గురించి టైమ్ దొరికినప్పుడు ఆలోచిస్తామని అవసరాన్ని బట్టి ఇందులో నటించే నటీనటుల్ని ఎంపిక చేస్తామని హృతిక్ నటిస్తాడా?  లేదా? అన్నది ఇప్పడు చెప్పలేమని పార్ట్ 3 కి ఎవరు అవసరమో వారిని ఖచ్చితంగా సంప్రదిస్తామని చెప్పుకొచ్చారు.