`మా` అధ్యక్షుడి కామెంట్ ఎవరూ పట్టించుకోరా?

Tue Sep 27 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Who is that star in the cyber harassment of Vishnu

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల ప్రహసనంలో వివాదాలు గొడవల గురించి తెలిసిందే. మంచు విష్ణు అధ్యక్షుడయ్యాక చాలా కాలం ఇవి కొనసాగాయి. ఇటీవల కొంత సద్ధుమణిగాయి అనుకుంటుండగానే తాజాగా విష్ణు ఓ స్టార్ యాక్టర్ పై చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. తనను తన కుటుంబాన్ని అతడు టార్గెట్ చేశాడని మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా విష్ణు ఒక స్టార్ టాలీవుడ్ నటుడిపై సంచలన విషయాలు వెల్లడించాడు.జూబ్లీహిల్స్ చెక్ పోస్టు సమీపంలో ఓ స్టార్ యాక్టర్ ఇరవై ఒక్క మంది ఉద్యోగులతో సాఫ్ట్ వేర్ సంస్థను నడుపుతున్నాడని వారు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఐపీ అడ్రస్ లు అవసరమైన అన్ని ఆధారాలతో మంచు విష్ణు హైదరాబాద్ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న స్టార్ నటుడి ఐపీ అడ్రస్ తో పాటు ఆఫీస్ ఐపీ అడ్రస్ ను పోలీసులకు షేర్ చేసినట్లు తెలిపారు. కానీ తనను తన కుటుంబాన్ని వేధిస్తున్న ఆ స్టార్ నటుడి పేరును విష్ణు వెల్లడించలేదు. ఆధారాలతో సహా తనకు సంబంధించిన మొత్తం సమాచారం అందడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.

నిజానికి `మా` అధ్యక్షుడయ్యే క్రమంలో వివాదాలతో అతడికి శత్రువులు పెరిగారు. పదవితో పాటు పాకులాటలో శత్రుత్వం పెరిగింది. పర్యవసానంగా కుట్రలు కుతంత్రాలపై అతడు మాట్లాడాల్సి వస్తోంది. ఏది ఏమైనా ఇది సరైనది కాదు. విష్ణు మంచి ఆర్టిస్టు. ఒక ఆర్టిస్టుగా కెరీర్ పరంగా బిజీబిజీగా ఉండడం చూడాలని .. `ఢీ` లాంటి హిట్ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటాలనేది అభిమానుల ఆకాంక్ష. కానీ అందుకు విరుద్ధంగా ఏదో జరుగుతోంది. విష్ణు ప్రస్తుతం అక్టోబర్ లో విడుదలయ్యే `గిన్నా` షూటింగ్ ను పూర్తి చేశాడు. నెక్ట్స్ ఏంటి అన్నది చెప్పాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.