ఆయన సంక్రాంతి మొగుడు.. ఈయన సంక్రాంతి విన్నర్!

Wed Jan 15 2020 23:00:01 GMT+0530 (IST)

Who Is the Sankranti Wnner At Telugu Box Office

సంక్రాంతి సినిమాల పోటీ ఎలా ఉంటుందనేది ప్రతిసారీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు కానీ ఈసారి అసలు సిసలు ఫైట్ ఎలా ఉంటుందో మాత్రం తెలిసింది. సంక్రాంతి పోటీ ముచ్చటగా మూడు నెలల క్రితమే ప్రమోషన్ల రూపంలో స్టార్ట్ అయింది. మిగతా సినిమాలు ఉన్నప్పటికీ ప్ప్రధన పోటీ మాత్రం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మధ్యే ఉంది.  లిరికల్ సాంగ్స్.. టీజర్.. ట్రైలర్లు.. రిలీజ్ డేట్లు ఇలా అన్ని విషయాలలో పోటీ కనిపించింది.ఇక తమ సినిమానే హిట్టు... తమ సినిమానే సంక్రాంతి విజేత అని ప్రకటించుకోవడంలో కూడా ఈ పోటీ కొనసాగుతోంది.  మహేష్ బాబు సినిమా పోస్టర్లలో 'సంక్రాంతి మొగుడు'..  అని ప్రచారం చేసుకుంటూ ఉంటే.. అల్లు అర్జున్ సినిమాను 'సంక్రాంతి విన్నర్' అని ఊదరగొడుతున్నారు.  పాపం ఆ 'దర్భార్' టీమ్ మాత్రం ఈ హంగామాకు చాలా దూరంగా ఉంది. ఇక టైటిల్ కు తగ్గట్టు 'ఎంతమంచివాడవురా' టీమ్  సిసలైన మంచివాడిలా  'మేమున్నాం కదా.. మా సినిమా రాకముందే సంక్రాంతి మొగుడు.. సంక్రాంతి విన్నర్ ఎలా?' అని ప్రశ్నించకుండా ఊరుకున్నారు.  

ఒకవైపు పోస్టర్ల పోటీ ఉంటే మరోవైపు కలెక్షన్స్ ఫిగర్ల విషయంలో కూడా పోటీ కొనసాగుతోందని కూడా టాక్ ఉంది. అసలు కలెక్షన్లకు ఫిక్స్డ్ హైర్లు.. జీఎస్టీలు.. ఆ టాక్సులు.. ఈ టాక్సులు మన్నూ మశానం కలిపి కలెక్షన్లను తారాస్థాయికి తీసుకుపోతున్నారనే ఈ వసూళ్లపై విమర్శలు జోరుగా వస్తున్నాయి.  ఇదిలా ఉంటే కొందరు దురభిమానులు ఈ కాకి లెక్కల సంగతి సరిగా తెలియక డిజిటల్ గా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ ఇంగ్లీష్ తిట్లు తిట్టుకుంటూ తెలుగు సంక్రాంతిని కసిగా ఎంజాయ్ చేస్తున్నారట.  ఈ లెక్కన 2020 సంక్రాంతిని స్పైసీ సంక్రాంతి అనుకోవచ్చు.


TAGS: