Begin typing your search above and press return to search.

వ్యాక్సినేష‌న్ అయితేనే థియేట‌ర్ రంగం హోప్

By:  Tupaki Desk   |   13 May 2021 3:30 AM GMT
వ్యాక్సినేష‌న్ అయితేనే థియేట‌ర్ రంగం హోప్
X
క‌రోనా క‌ల్లోలంతో టాలీవుడ్ తీవ్ర సంక్షోభంలో ప‌డింది. తొలి వేవ్ త‌ర్వాత ముందుగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌కు అనుమ‌తివ్వ‌డం...అటుపై నెమ్మ‌దిగా 100 శాతం అనుమ‌తుల‌తో సినిమాలు బాగా ఆడాయి. నిర్మాత‌లు ఎగ్జిబిటర్లు- బ‌య్యర్లు ఊపిరి పీల్చుకున్నారు. నెమ్మ‌దిగా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌ని సంతోషించారు. న‌ష్టాల్ని నెమ్మ‌దిగా పూరించుకోవ‌చ్చ‌ని భావించారు. కానీ ఇంత‌లోనే అనూహ్యంగా మ‌హ‌మ్మారి సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో ఒక్క‌సారిగా థియేటర్లు మూత‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్లు మ‌ళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి త‌లెత్తింది.

తొలి వేవ్ స‌మ‌యంలో అవ‌గాహనా లోపంతో థియేట‌ర్లు తెరిచినా....తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో థియేట‌ర్లు ఇప్ప‌ట్లో తెర‌వ‌డం అసాధ్య‌మ‌ని తెలుస్తోంది. ఏపీ తెలంగాణ‌ల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తయ్యే వ‌ర‌కూ ఎట్టి ప‌రిస్థితుల్లో థియేట‌ర్లు తెరిచే అవ‌కాశం లేద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ‌లో ఇప్ప‌టికే సీనియ‌ర్ సిటిజ‌న్లకు,.. 18 నుంచి 45 వ‌య‌స్కుల వారికి వ్యాక్సినేష‌న్ జ‌రుగుతోంది. ఇక ఏపీలో కేవ‌లం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కే వ్యాక్సిన్ వేస్తున్నారు. వాళ్ల‌కు పూర్త‌వ్వడానికే అక్టోబ‌ర్ వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తుంది. ఆ త‌ర్వాత నుంచి ఏపీలో 18 నుంచి 45 వ‌య‌సు గ‌ల వారికి వ్యాన్సినేష‌న్ వేస్తామ‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదంతా పూర్త‌వ్వాలంటే జ‌న‌వ‌రి వ‌ర‌కూ గానీ పూర్తికాద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

అయితే మిన‌హాయింపుల్లో భాగంగా వ్యాక్సినేష‌న్ స్టేట‌స్ ను బ‌ట్టి రెండు రాష్ట్రాల్లో 50 శాతం అక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుచుకునే అవ‌కాశం లేక‌పోలేదు. అదీ అగ్ర హీరోల చిత్రాల‌కు నిర్మాత‌ల‌కు తీవ్ర న‌ష్ట‌మ‌నే చెప్పాలి. భారీ బ‌డ్జెట్ సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేయ‌డం అంటే న‌ష్టాల‌తో కూడిన ప‌నే అని తొలి వేవ్ లోనే అర్ధ‌మైంది. కాబ‌ట్టి అగ్ర నిర్మాత‌లు త‌మ సినిమాల రిలీజ్ తో ముందుకొచ్చే అవ‌కాశం లేదు. అయితే చిన్న చిత్రాల నిర్మాత‌ల‌కు మాత్రం కాస్తాంత ఆమోద‌యోగ్య‌మైన‌ది. త‌క్కువ బ‌డ్జెట్ సినిమాలు కాబ‌ట్టి 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వ‌హించినా పెద్ద‌గా న‌ష్టాలుండ‌వ‌న్న‌ది నిపుణ‌ల మాట‌. ఏదేమైనా రెండు రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌వ్వడానికి ఎంత స‌మ‌యం ప‌డుతుంది అన్న దానిపై స‌రైన క్లారిటీ అయితే లేదు. 2022 మిడ్ వ‌ర‌కూ నిర్మాత‌ల‌కు గ‌డ్డుకాల‌మే అన్న‌ది మాత్రం వాస్త‌వం.