మోహన్ బాబు బీజేపీలో ఎప్పుడు చేరారబ్బా?!

Tue Jun 28 2022 14:00:00 GMT+0530 (IST)

When did Mohan Babu joined BJP?!

ప్రముఖ సినీ నటుడు శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు రూటే సపరేటు. నా రూటే సపరేటు అంటూ ఆయన సినిమాలోనే డైలాగ్ కూడా ఉంది. ఆ డైలాగ్ లానే ఆయన కూడా నడుచుకుంటూ ఉంటారని అంటుంటారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో.. ఎవరిపైన సంచలన వ్యాఖ్యలు చేస్తారో తెలియదని చెబుతుంటారు.ఇప్పుడు తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.. మోహన్ బాబు. తాను బీజేపీ మనిషినంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఒక కేసు విచారణ నిమిత్తం తన కుమారులతో కలిసి తిరుపతి వచ్చిన మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ మనిషినని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకున్నానని తెలిపారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల ముందు మోహన్ బాబు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమారుడు హీరో మంచు విష్ణుతో కలిసి వెళ్లి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఫీజురీయింబర్స్ మెంట్ నిధులను ఇవ్వడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అప్పట్లో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండటంతో నిబంధన ప్రకారం మోహన్ బాబు ఆయన కుమారులపై కేసు నమోదైంది.

ఈ కేసు విచారణ సందర్భంగా తాజాగా జూన్ 28న మోహన్ బాబు తన కుమారులతో కలసి తిరుపతి వచ్చారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తన కుమారులు విష్ణు మనోజులతో కలసి పాదయాత్ర ద్వారా కోర్టుకు చేరుకున్నారు.

కోర్టు నుంచి బయటకొచ్చాక మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. కేసు వాయిదా వేశారని చెప్పారు. తాను ఏది మాట్లాడినా తప్పు అవుతుందని వాపోయారు. న్యాయమూర్తి పిలిస్తే వచ్చానని..పేపరు పైన సంతకం పెట్టమంటే పెట్టానని వెల్లడించారు. తాను బీజేపీ మనిషినని.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని తెలిపారు. .తాను రియల్ హీరోనని చెప్పుకొచ్చారు. గతంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక మోహన్ బాబు కుటుంబం మొత్తం వెళ్లి ఆయనతో ఫొటోలు దిగివచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు వైఎస్సార్సీపీలో చేరాక మోహన్ బాబుకు రాజ్యసభ సీటు ఇస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారని ఫిల్మ్ డెవలపమెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని ఇలా అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. అయితే మోహన్ బాబుకు ఏ పదవీ దక్కలేదు. ఆప్పటి నుంచి ఆయన నైరాశ్యంలో ఉన్నారని చెబుతున్నారు. ఇక మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయ్ కుమార్తె విరానికాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విష్ణు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే సినిమా టికెట్లను ఖరారు చేసే ప్రక్రియలో మోహన్ బాబు ఆయన కుమారుడు విష్ణుకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని.. వారు ఇందుకు కినుక వహించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు తాను బీజేపీ మనిషినని బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకున్నానని చెప్పారని అంటున్నారు.