Begin typing your search above and press return to search.

జగన్ తో భేటీ ఎపుడు.. ?

By:  Tupaki Desk   |   25 Oct 2021 12:30 AM GMT
జగన్ తో భేటీ ఎపుడు.. ?
X
టాలీవుడ్ అతి పెద్ద అయోమయంలో పడిపోయింది. వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నుయ్యి అన్నట్లుగా పరిస్థితి ఉంది. టాప్ హీరోల నుంచి మొదలుపెడితే పాన్ ఇండియా మూవీస్ దాకా దారీ తెన్నూ లేక దిక్కులు చూస్తున్నాయి. వందల వేల కోట్ల రూపాయలు అలా ఫిల్మ్ రీళ్ళలో పడి నలిగిపోతోంది. మరి ఇంతటి విపత్కర పరిస్థితి కలగడానికి కారణాలు ఏంటి అంటే ఎన్నో అని చెప్పాలి. కరోనా ముందు తరువాత అని టాలీవుడ్ ని అభివర్ణిస్తున్నారు. అయితే కరోనా ముందు కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు, అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఉన్న దాన్ని కరోనా వచ్చి టోటల్ గా కాటేసింది.

టాలీవుడ్ లో ఇపుడు అతి పెద్ద దిగులు పట్టుకుంది. పెద్ద సినిమాలు ఏవీ ఈ రోజుకీ రిలీజ్ కి రావడం లేదు. మధ్యలో కరోనా తగ్గిన సమయంలో కూడా మీడియం రేంజి మూవీస్ వచ్చాయి తప్ప భారీ బడ్జెట్ మూవీస్ అయితే నో రిలీజ్ అన్న మాటే ఉంది. వకీల్ సాబ్ కరోనా రెండవ దశ ముందు రిలీజ్ అయి ఎలా కొట్టుకుపోయిందో చూసాక ఏవరూ రిస్క్ చేయడంలేదు. అందుకే మెగాస్టార్ ఆచార్య మూవీని ఏకంగా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. బాలయ్య అఖండ మూవీకి డిసెంబర్ లో కనుక చాన్స్ లేకపోతే ఆచార్య పక్కనే సెటిల్ కావాల్సి ఉంది. ఇక సంక్రాంతి మూవీస్ కధ కూడా అలాగే ఉంది.

ఏ మూవీ రిలీజ్ అవుతుంది. ఏది ఆగుతుంది అన్న దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు. దీనికి కరోనా థర్డ్ వేవ్ భయం ఒక వైపు ఉంటే ఏపీ సర్కార్ ఆన్ లైన్ టికెటింగ్ విధానం కూడా ఇబ్బంది పెడుతోంది అంటున్నారు. అలాగే పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోకుండా చేయడం వల్ల భారీ చిత్రాలు దెబ్బ తింటాయని అంటున్నారు. టాలీవుడ్ లో బాహు బలి తరువాత బడ్జెట్ స్కేల్ మారిపోయింది. స్టార్ హీరోలు ఎలాంటి సినిమా అయినా సులువుగా వంద కోట్ల దాకా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇదంతా తమ హీరోల పాపులారిటీని బట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కలెక్షన్లతో మొత్తానికి మొత్తం కుమ్మేయవచ్చు అన్న ఆలోచనతోనే చేస్తున్నారు.

ఆన్ లైన్ టికెటింగ్ విధానం మీద ఎవరూ ఇపుడు మాట్లాడడం లేదు. సీఎం జగన్ వద్దకు టాలీవుడ్ ప్రముఖులు వెళ్తారని ఆ మధ్యన ప్రచారం జరిగింది. అయితే ఇంతలో మా ఎన్నికలు జరగడంతో సీన్ మారింది. ఇపుడు టాలీవుడ్ పెద్దలు అంటే ఎవరు అన్న ప్రశ్న కూడా వస్తోంది. తొడ కొట్టి మరీ గెలిచిన మా కొత్త ప్రెసిడెంట్ విష్ణు ఆయన వెనక ఉన్న వారూ ఈ తగవు తీర్చాలని డిమాండ్ చేసేవారూ ఉన్నారు. మొత్తానికి టాలీవుడ్ లోనే ఒక రకమైన వర్గ పోరు సాగుతోందా అన్న డౌట్లు వస్తున్నాయి. మరి అక్కడ కనుక క్లారిటీ లేకపోతే జగన్ని కలసి వినతి చేసే సీన్ ఉండదు. మరి అందరూ కలసి వచ్చి అడిగితే ఏమవుతుందో ఏమో కానీ ఇపుడు ఎవరికి వారు బిగదీసుకుని కూర్చుంటే ఏపీ సర్కార్ కూడా ఆ ఇష్యూ మీద పెద్దగా రెస్పాండ్ అయ్యేందుకూ లేదు. మొత్తానికి టాలీవుడ్ బడా మూవీస్ అన్నీ వాయిదాల పర్వానే నమ్ముకున్నాయి. 2022 అయినా టాలీవుడ్ కి మేలు చేస్తుందా.. వెయిట్ అండ్ సీ.