మెగా అల్లు కాంపౌండ్ లలో ఏం జరుగుతోంది?

Mon May 23 2022 13:01:44 GMT+0530 (IST)

What's going on in Mega and Allu Compounds?

మెగా హీరోలు మారుతున్నారు! GA కాంపౌండ్ దిగొస్తోంది. అయితే ఇదంతా ఎందుకని? అంటే పునరుజ్జీవం కోసం.. హిట్టు మీద హిట్టు కొట్టడానికి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వీళ్లు వాళ్లు ఏం మారారు? ఎందుకని దిగొచ్చారు? అంటే.. దానికి కారణాలు అనేకం ఉన్నాయి.నిజానికి మెగా కాంపౌండ్ కి 'ఆచార్య' నేర్పిన పాఠం అంతా ఇంతా కాదు. బయ్యర్లు పంపిణీదారులకు నష్టాలు కలిగించిన తీరు సర్వత్రా చర్చకు రావడంతో ఇకపై కొణిదెల బ్యానర్ లో తీసే సినిమాలకు ఇలా జరగకూడదని భావిస్తున్నారని సమాచారం.

అవసరం మేరకు బడ్జెట్ల పరంగా కరెక్షన్ కి రావడం.. అలాగే  కథల ఎంపిక  స్క్రిప్టు ఎంపిక పరంగా ఇంకాస్త అధిక జాగ్రత్తలు తీసుకోవడం వగైరా ప్లాన్ ని అమలు చేస్తున్నారని సమాచారం. చిరు నటించే తదుపరి రీమేక్ లపైనా ఈ  ప్రభావం పడింది. మొత్తం మెగా కాంపౌండ్ ఇప్పుడు కాస్ట్ కటింగ్ వైపు దృష్టి సారించిందని తెలుస్తోంది.

అలాగే అల్లు కాంపౌండ్ లోనూ ఇలాంటి పరిణామం కనిపిస్తోంది. ఒక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మినహా ఈ కాంపౌండ్ లో అన్నీ ఫ్లాపులే ఎదురవుతున్నాయి. యువహీరోలతో తీసినవి ఆడడం లేదు. ఇక గీతా బ్యానర్ లో నూ సరైన సక్సెస్ లేక మూడేళ్లవుతోంది.  మారుతి- సాయి తేజ్ తో  ప్రతిరోజు పండగే తరవాత కమర్షియల్ హిట్టు అన్నదే లేదు.

కారణం ఏదైనా కానీ  జీఏ టీమ్ అంతా ఇప్పుడు కాస్ట్ కంట్రోల్ మోడ్ లో ఉందని తెలిసింది. దీనిపై కోర్ టీమ్ లో డిస్కషన్లు సాగుతున్నాయి. స్టోరి సిట్టింగ్స్ సహా స్క్రిప్టు విషయమై అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిసింది. మొత్తానికి అగ్ర బ్యానర్లలో పెద్ద హీరోల్లోనూ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. మెగా అల్లు కాంపౌండ్ కరెక్షన్ స్టేజ్ లో ఉన్నాయని అర్థమవుతోంది.

ఇకపై వీరంతా కంటెంట్ పైనా కొత్తదనం పైనా యూనివర్శల్ అప్పీల్ పైనా దృష్టి సారించేందుకు రకరకాలుగా కసరత్తులు చేస్తున్నారు. ఇది వెటరన్స్ కంటే కొత్త జనరేషన్ రైటర్లు దర్శకులకు కూడా అవకాశాలు కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.