'ఆడవాళ్లు మీకు జోహార్లు' పరిస్థితి ఏంటబ్బా?

Fri Jun 18 2021 22:00:02 GMT+0530 (IST)

What is the status of adavallu meeku joharlu movie

శర్వానంద్ హీరోగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను ఎనౌన్స్ చేసి చాలాకాలమే అయింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా క్రితం ఏడాది అక్టోబర్లో ఈ సినిమా 'తిరుపతి'లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. మొదట్లో ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తుందనీ .. ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన నిత్యామీనన్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ చివరికి రష్మికను ఎంపిక చేసుకున్నట్టుగా ప్రకటించారు .. పూజా కార్యక్రమాల్లో రష్మిక పాల్గొంది కూడా.


ఆ తరువాత 'శ్రీకారం' సినిమాతో శర్వానంద్ .. 'పొగరు' .. 'సుల్తాన్' సినిమాలతో రష్మిక .. 'రెడ్' సినిమాతో కిషోర్ తిరుమల బిజీ అయ్యారు. ఇలా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు తీరికలేకుండాపోయింది. ఆ సినిమాలు విడుదలైపోయాయి కూడా. ఇక  ఇప్పుడు కూడా 'మహాసముద్రం' సినిమా షూటింగులో శర్వానంద్ ఉన్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'పుష్ప' సినిమాతో రష్మిక బిజీగా ఉంది. రష్మిక కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా నిర్మితమవుతోంది. కిషోర్ తిరుమల ఏం చేస్తున్నాడనేది మాత్రం తెలియదు.  

    
ఈ నేపథ్యంలోనే అసలు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా ఏమైపోయిందనే ఆలోచన అభిమానులకు కలుగుతోంది. ఇటు శర్వానంద్ గానీ .. అటు రష్మిక గాని ఈ ప్రాజెక్టు గురించి ఏమీ మాట్లాడటం లేదు. దర్శకుడు కిశోర్ తిరుమల సందడి కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టు కంటే వెనక పట్టాలెక్కిన సినిమాలు చకచకా ముందుకు వెళుతున్నాయి. శర్వానంద్ జోడీగా రష్మికను చూడాలనుకున్న అభిమానులు మాత్రం ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎదురుచూసి .. చూసి నిరాశపడిపోతున్నారు .. నీరసపడిపోతున్నారు.