Begin typing your search above and press return to search.

కాలగర్భంలో శాంతి థియేటర్​.. అదే బాటలో మరికొన్ని.. ఈ దుస్థితికి కారణమేంటి?

By:  Tupaki Desk   |   5 Dec 2020 1:30 AM GMT
కాలగర్భంలో శాంతి థియేటర్​.. అదే బాటలో మరికొన్ని.. ఈ దుస్థితికి కారణమేంటి?
X
హైదరాబాద్​లో సింగిల్​ స్క్రీన్​ థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా దెబ్బతో ఎన్నో నెలలుగా చాలా థియేటర్లు నష్టపోయాయి. దశాబ్ధాల చరిత్ర ఉన్న శాంతి థియేటర్​ను తప్పని సరి పరిస్థితుల్లో మూసేస్తున్నట్టు ప్రకటించింది యాజమాన్యం. శాంతి థియేటర్​ బాటలోనే అనేక థియేటర్లు పయనిస్తున్నాయి. దిల్​సుఖ్​నగర్​లోని మెగా, వెంకటాద్రి, కోణార్క్​ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. థియేటర్లు మూతపడటానికి తక్షణ కారణం అయితే కరోనాయే కానీ అసలు కారణం మాత్రం కేవలం కరోనా మాత్రమే కాదు. కరోనా ముప్పు రాకముందే తెలుగురాష్ట్రాల్లోని సింగిల్​స్క్రీన్​ థియేటర్లు మూతబడే పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి.

ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్​ థియేటర్స్​కు పెద్దగా రావడంలేదు. సినిమాల చూస్తున్నది యువత మాత్రమే. వారు కూడా మల్టిపెక్స్​ల్లోనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. మారుతున్న అభిరుచులే ఇందుకు కారణం. అయితే కరోనా రాకముందే హైదరాబాద్​తో పాటు తెలుగురాష్ట్రాల్లోని పలుచోట్ల థియేటర్లు నష్టాలలతో నడిచేవి. ప్రభుత్వం పార్కింగ్​ ఫీజ్​ ఎత్తేయడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. నిర్వహణ భారం పెరిగిపోయి థియేటర్లు మూసేసే పరిస్థితి వచ్చింది. కరోనాతో థియేటర్లు మూతపడటంతో ఇప్పటికే యాజమాన్యం అందులోని సిబ్బందిని ఇంటికి పంపించేసింది. నిదానంగా థియేటర్లను కూడా మూసేస్తున్నారు.

నారాయణగూడలోని శాంతి థియేటర్​కు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఫ్యామిలీ ఆడియన్స్​ ఎక్కువగా ఈ థియేటర్​కు వెళ్లేవారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే అక్కడే చిత్రాలను కూడా ప్రదర్శించేవారు. అంతేకాక శాంతి థియేటర్​ నిర్మాణపరంగా కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. 1969లో పిచ్చేశ్వర రావు అనే వ్యాపారి నారాయణగూడలో శాంతి థియేటర్​ను నిర్మించారు.అంతకు ముందు ఇక్కడ మామిడితోట ఉండేదట. పిచ్చేశ్వర్​రావు ఎంతో ఆసక్తితో దీని నిర్మాణం చేపట్టారు. పుణె నుంచి వాస్తుశిల్పిని తీసుకొచ్చి దగ్గరుండి డిజైన్ చేయించారు. థియేటర్‌లో పెట్టిన షాండ్లియర్ కోసం ఆయన దేశమంతా పర్యటించారట.

ఈ థియేటర్​ను మూసేస్తున్నట్టు ఆయన ఇటీవల సోషల్​మీడియాలో పోస్ట్​ పెట్టారు. ఈపోస్టుకు సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. చాలా మంది తమ కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. కాలేజీ ఎగ్గోట్టి శాంతి థియేటర్​కు వెళ్లిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అయితే ఇప్పడు ఒక్క శాంతి థియేటర్​ మాత్రమే కాక.. హైదారబాద్​లోని పలు థియేటర్లు మూత పడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

మూతపడుతున్న థియేటర్లను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలని.. థియేటర్లకు విద్యుత్​బిల్లలను మాఫీ చేయాలని, పార్కింగ్​ ఫీజు వసులు చేసుకోనే అవకాశం ఇవ్వాలని థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు విజేందర్ రెడ్డి కోరుతున్నారు. నిజానికి టికెట్ల రూపంలో వచ్చే సొమ్మంతా సినీ నిర్మాతలకు, డిస్టిబ్యూటర్లకే వెళ్లిపోతుందని ఆయన వివరించారు. అందువల్ల పార్కింగ్​ ఫీజు వసులు చేసుకొనే అవకాశం కల్పిస్తే థియేటర్లు కొంతవరకు కోలుకుంటాయని ఆయన అంటున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.