గిల్డ్ లో ఏం జరుగుతోంది?

Sat Aug 13 2022 11:43:33 GMT+0530 (IST)

What is Happening in Guild?

టాలీవుడ్ షూటింగ్ ల బంద్ వ్యవహారంతో గిల్డ్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వున్నా  సరే గిల్డ్ ప్రముఖ పాత్ర పోషిస్తూ షూటింగ్ ల బంద్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుని షాకిచ్చింది. అయితే ఈ నిర్ణయంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సుముఖతని వ్యక్తం చేకపోగా బంద్ ని  ముక్తకంఠంతో వ్యతిరేకించారు. షూటింగ్ ల బంద్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ సంచలన కామెంట్ లు చేశారు.అయితే ఫైనల్ గా గిల్డ్ ఏం మతలబు చేసిందో..ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులని ఎలా ఒప్పించిందో తెలియదు కానీ మొత్తానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు కూడా గిల్డ్ బంద్ కు జై కొట్టారు. షూటింగ్ ల నిలిపి వేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయినా సరే ఎక్కడో చిన్నా చితకా అసంతృప్తిని గిల్డ్ పై కొంత మంది వ్యక్తం చేస్తూనే వున్నారు. ఇదిలా వుంటే తాజాగా యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరోసారి వార్తల్లో నిలిచింది.

సినిమా నిర్మాణ వ్యయం అదనపు వేస్టేజీ ఆర్టిస్ట్ ల రెమ్యునరనేషన్ లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల స్టాఫ్ ఖర్చులు అంటూ ఇటీవల పలు కమిటీలని నియమించిన గిల్డ్ వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది. అంతర్గత ప్రక్షాళన దిశగా గిల్డ్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త రచ్చకు తెరలేపినట్టుగా చెబుతున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వున్నా కూడా ప్రత్యేకంగా యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని నియమించాలని అందులో యాక్టీవ్ గా సినిమాలు నిర్మించే వారే వుండాలని ప్లాన్ చేశారు.

ఆ ప్లాన్ ప్రకారమే ఎంత మంది ఇందులో చేరితే అంత బలంగా భావించి ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్ ని హీరోల మేనేజర్లని కూడా ఎడా పెడా యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లు ఎందుకు అనే చర్చ మొదలైంది. దీంతో తాజాగా ప్రక్షాళ మొదలు పెట్టారట. అయితే ఇది ఏక పక్ష ప్రక్షాళన అని సభ్యులు మండిపడుతున్నారు. దీనికి కారణం తాజాగా హీరో నాని నాగశౌర్య నితిన్ లకు మేనేజర్ గా వ్యవహరిస్తున్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వెంకట రత్నం ( నాని వెంకట్) ని యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి తొలగించారట.

ఇదే ఇప్పుడు పెద్ద రభసగా మారినట్టు తెలుస్తోంది. ఏ కారణం చేత అతన్ని గిల్డ్ నుంచి తొలగించారని కొంత మంది ముందు అన్నీ తెలిసే గిల్డ్ లో చేర్చుకున్నారు కదా ఇప్పుడు అవన్నీ ఎలా అడ్డొచ్చాయి? .. అతన్నే ఎందుకు తొలగించారు. అతని లాగే మిగతా వాళ్లు చాలా మందే వున్నారు. మరి వాళ్ల సంగతి ఏంటీ?  వాళ్లని కూడా తొలగించండి అంటూ చాలా మంది నిర్మాతలు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని ప్రశ్నిస్తుండటం ఇప్పడు రచ్చగా మారింది. నాని నటిస్తున్న దసరా నిర్మిస్తున్న హిట్ 2 సినిమాల నిర్మాణం ఆపకపోవడం వల్లే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వెంకట రత్నం ని గిల్డ్ నుంచి కావాలనే తొలగించారని కొంత మంది మండిపడుతున్నారు.

ఇదే సమయంలో కొత్త పాయింట్ ని కూడా లేవనెత్తుతున్నారు. యాక్టీవ్ గా సినిమాలు నిర్మించని వాళ్లే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో అత్యధిక శాతం వున్నారని యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని ప్రారంభించారు. మరి అలాంటప్పుడు ఎప్పుడో ఒకటి అర సినిమాలు తీసి ప్రస్తుతం నిర్మాణం వంక కూడా కన్నెత్తి చూడని వారిని గిల్డ్ లో సభ్యులుగా ఎందుకు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వెంకట రత్నంని గిల్డ్ నుంచి తొలగిస్తే వారిని కూడా యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి తొలగించాలని కొంత మంది నిర్మాతలు బాహాటంగానే ప్రశ్నించడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.