'మాస్టర్ చెఫ్' పట్ల టాలీవుడ్ మేల్ సెలబ్రిటీలకు ఏమైంది..??

Wed Jun 16 2021 09:00:01 GMT+0530 (IST)

What happened to the Tollywood male celebrities towards Master Chef

మనం ఇప్పటివరకు టీవీ షోలలో ఎన్నో రియాలిటీ షోస్ చూసాం. కానీ వంటకు సంబంధించిన ప్రోగ్రాంస్ మాత్రం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఈ వంటల్లో కూడా లోకల్ లేదా ప్రాంతం వరకు చాలా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. కానీ కుకింగ్ షోలలో అన్నిటికన్నా పాపులర్ షో మాత్రం 'మాస్టర్ చెఫ్' అనే చెప్పాలి. ఆస్ట్రేలియా మొదలుకొని అమెరికాతో పాటు అనేక ప్రపంచదేశాల్లో ఈ మాస్టర్ చెఫ్ విజయవంతంగా నిర్వహించబడుతుంది. అలాగే అనేక దేశాలతో పాటు ఇండియాలో కూడా పదేళ్లుగా మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాం.దాదాపు మూడు దశాబ్దాలుగా మాస్టర్ చెఫ్ అనేది విదేశాల్లో సక్సెస్ అవుతోంది. కానీ ఇండియాలో ఈ కార్యక్రమం 2010లో ప్రారంభమైంది. కానీ స్టార్ ప్లస్ టీవీ ఛానల్ ద్వారా కేవలం హిందీలో మాత్రమే ప్రసారం జరిగింది. ఇప్పుడు ఎక్కడికక్కడే ప్రాంతీయ భాషల్లో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకొస్తుంది సన్ నెట్వర్క్స్ యాజమాన్యం. అయితే ఈ విధంగా త్వరలో తెలుగుతో పాటు తమిళ - కన్నడ - మలయాళం భాషల్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ మాస్టర్ చెఫ్ హోస్ట్ ఎవరినేది. నిజానికి మాస్టర్ చెఫ్ కన్నడ హోస్ట్ స్టార్ హీరో సుదీప్ కాగా తమిళ ప్రోగ్రాంకు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

అయితే ఇప్పుడు తెలుగులో మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంను హోస్ట్ చేయనుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఈ ప్రోగ్రాంలో హోస్ట్ గా తమన్నా ఎంపిక అవ్వడంతో ఓవైపు పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నప్పటికి మరోవైపు మేల్ హోస్ట్ లేరా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వేరే భాషల్లో ఈ షోను మేల్ సెలబ్రిటీలే హోస్ట్ చేస్తుండగా.. తెలుగులో మాత్రం మేల్ సెలబ్రిటీలకు ఏమైంది అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సుదీప్ - విజయ్ సేతుపతి లాంటి వారే వంట ప్రోగ్రాం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండగా.. తెలుగులో అంతటి స్టార్స్ - మీడియం స్టార్స్ ఏమయ్యారంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఈ షో నిర్వహించే సామర్థ్యం టాలీవుడ్ మేల్ సెలబ్రిటీలలో లేదేమో అంటున్నారు నేటిజన్లు. ఇదిలా ఉండగా.. తమన్నా ఎంపిక అయినందుకు ఓ పక్కన హ్యాపీ అవుతున్నారు.  ఆల్రెడీ డిజిటల్ ఎంట్రీ చేసిన అమ్మడు.. ఈ షో ద్వారా టీవీ స్క్రీన్ పై మెరవనుంది. చూడాలి మరి అమ్మడు ఎలా డీల్ చేస్తుందో..!