మన హీరోల మైల్ స్టోన్ మూవీస్ పరిస్థితేంటీ?

Mon Dec 05 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

What about the milestone movies of our heroes

ప్రతీ హీరోకు మైల్ స్టోన్ మూవీ అంటూ కొన్ని వుంటాయి. ఒక్కో దశకు ఒక్కో సినిమా వుంటుంది. ఆ ప్రాజెక్ట్ ని అత్యంత స్పెషల్ గా చూస్తుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. ఇక్కో హీరోలకు 25 వ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలిస్తే మరో స్టార్ కు 50వ సినిమా స్పెషల్ అవుతూ వుంటుంది. మరో హీరోకు 75 100 150.. ఇలా ఒక్కో హీరో ఒక్కో సినిమాని ప్రత్యేకంగా చూస్తూ మరింత ప్రత్యేకంగా మలుచుకోవాలని చూస్తుంటారు. ఇప్పడు సీనియర్ హీరో నాగార్జున నుంచి సత్యదేవ్ వరకు మైల్ స్టోన్ మూవీలతో రెడీ అవుతున్నారు. అవేంటీ? వఆటి కథేంటో ఒకసారి చూద్దాం.సీనియర్ హీరో కింగ్ నాగార్జున తన వందవ సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. `ఘోస్ట్` సినిమాతో సూపర్ హిట్ ని దక్కించుకుని వందవ సినిమాకు రెట్టించిన ఉత్సాహంతో రెడీ కావాలనుకున్నారు. కానీ ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో నాగార్జున తన 100వ సినిమా కోసం ప్రస్తుతం కథలు వింటున్నారు. `ఘోస్ట్` ఫలితం కారణంగా ఓ పట్టాన 100వ ప్రాజెక్ట్ కోసం ఏకథనీ ఓకే చేయడం లేదట. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి `ఘోస్ట్` ప్రీ రిలీజ్ వేడుకలో తన వందవ సినిమాలో అఖిల్ తో కలిసి నటిస్తానని ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్ ని `గాడ్ ఫాదర్` ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే `గాడ్ ఫాదర్` ఫలితంతో ఆలోచన మార్చుకున్న నాగార్జున ఆ అవకాశాన్ని రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడకు ఇవ్వబోతున్నాడని ప్రచారం మొదలైంది. అయితే దీనిపై ఇంత వరుకు ఎలాంటి అథికారిక అప్ డేట్ రాలేదు. దీంతో నాగ్ వందవ సినిమాని అధికారికంగా ప్రకటించే వరకు ఎంత మంది దర్శకుల పేర్లు వినిపిస్తాయో వేచి చూడాల్సిందే.

ఇక ప్రభాస్ తన 25వ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ మూవీని `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి స్పిరిట్ అనే టైటిల్ ని ఫైనల్ చేశారు కూడా. భద్రకాళి పిక్చర్స్ టి సిరీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నాయి. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నాడు. సందీప్ వంగ .. రణ్ బీర్ తో `యానిమల్` మూవీ చేస్తున్నాడు. ఇద్దరు తమ కమిట్ మెంట్ లు పూర్తి చేసుకున్న తరువాత 2024 లో `స్పిరిట్` రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారట.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో అత్యంత ముఖ్యంగా భావిస్తున్న 30వ ప్రాజెక్ట్ ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ని ప్రత్యేకంగా భావిస్తున్నాడు. ఇటీవలే దర్శకుడు కొరటాల శివ ఈ మూవీ ప్రి ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. త్వనలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్ ని ఇచ్చే అవకాశం వుందని తెలిసింది.

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా తన కెరీర్ లో 25వ ప్రాజెక్ట్ గా `కృష్ణమ్మ`లో నటిస్తున్నాడు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు. విజయవాడ నేపథ్యంలో సాగే స్నేహితుల కథగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యదేవ్ తరహాలోనే తమిళ హీరో కార్తి కూడా తన 25వ ప్రాజెక్ట్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. కార్తి నటిస్తున్న 25వ ప్రాజెక్ట్ `జపాన్`. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. వీరితో పాటు రవితేజ 75 చిత్రాల మైలు రాయికి అల్లు అర్జున్ 25 చిత్రాల మైలు రాయికి చేరుకోవడం విశేషం.