Begin typing your search above and press return to search.

#బ్యాన్ గ్ర‌హ‌ణ్.. శిక్కుల గాయాల‌పై ఉప్పు చ‌ల్లారు..!

By:  Tupaki Desk   |   24 Jun 2021 3:30 AM GMT
#బ్యాన్ గ్ర‌హ‌ణ్.. శిక్కుల గాయాల‌పై ఉప్పు చ‌ల్లారు..!
X
వివాదాస్ప‌ద వెబ్ సిరీస్ ల వెల్లువ నిరాఠంకంగా కొన‌సాగుతోంది. అమెజాన్ ప్రైమ్ .. నెట్ ఫ్లిక్స్ స‌హా ప‌లు ఓటీటీ వేదిక‌ల‌పై ఈ త‌ర‌హా కంటెంట్ వెల్లువ‌పై నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌లే రిలీజైన ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ పై త‌మిళ టైగ‌ర్లు త‌మ అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కి ఈ త‌ర‌హా సెగ తాకింది. 1984 శిక్కు వ్యతిరేక అల్లర్ల సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన‌ వెబ్ సిరీస్ `గ్రహణ్‌` ను వెంటనే నిషేధించాలని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్ జిపిసి) అధ్యక్షుడు బీబీ జాగీర్ కౌర్ సోమవారం డిమాండ్ చేశారు. దీనిని జూన్ 24 న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ వేదికపై విడుదల చేయనుండ‌గా రిలీజ్ పై స‌స్పెన్స్ నెల‌కొంది.

నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా జరిగిన 1984 సిక్కుల మారణహోమం ఆధారంగా గ్ర‌హ‌ణ్ తెర‌కెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో ఓ శిక్కు పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారు. వెబ్ సిరీస్ లో శిక్కు పాత్ర వ‌ల్ల‌నే మారణహోమం అయిన‌ట్టు చూపించార‌ని ఆరోపిస్తున్నారు. శిక్కుల‌ను త‌ప్పు గా చూప‌డం ఖండించదగినది కల్పితమైనది.. అంటూ అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది.

వెబ్ సిరీస్ నిర్మాత అజయ్ జి రాయ్ కి 84 అల్లర్ల సాక్షి బీబీ కౌర్ పంపిన లీగల్ నోటీసుకు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ అధినేత అధ్యక్షుడు సునీల్ ర్యాన్ కూడా మద్దతు ఇస్తున్నారని బీబీ కౌర్ తెలిపారు.

ఆమె మాట్లాడుతూ,``ఈ వెబ్ సిరీస్ ద్వారా శిక్కుల గాయాలపై ఉప్పు చ‌ల్లారు. వారి మనోభావాలను దెబ్బతీసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఇలాంటి సినిమాలు సమాజంలో మత సామరస్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇటువంటి సున్నితమైన అభ్యంతరకరమైన పోకడలను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన సమాచార సాంకేతిక (ఐటి) నిబంధనలను అమలు చేయాలి`` అని బీబీ కౌర్ వ్యాఖ్యానించారు.