సారంగ దరియాతో బాధపడ్డాంః శేఖర్ కమ్ముల

Thu Apr 08 2021 10:00:01 GMT+0530 (IST)

We suffered with Saranga Daria: Shekhar Kammula

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'లవ్ స్టోరీ.' ఈ సినిమాలోని 'సారంగ దరియా' అనే జానపద గేయం ఏ స్థాయిలో విజయవంతం అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ.. అదే స్థాయిలో వివాదంగానూ మారింది. ఇంకా చెప్పాలంటే.. ఆ వివాదం తరచూ చర్చల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా.. ఈ వివాదంపై మరోసారి స్పందించారు శేఖర్ కమ్ముల.గతంలో మాటీవీ లో ప్రసారమైన 'రేలారే రేలా' కార్యక్రమంలో కోమలి అనే సింగర్ ఈ పాట పాడింది. 'సారంగ దరియా' అనేది తెలంగాణలోని జానపదం. ఇది ఎన్నో తరాల నుంచి జనాల నోళ్లలో నానుతున్న పాట. అయితే.. దాన్ని సేకరించి గుర్తింపు తెచ్చింది తానే అన్నది కోమలి వాదన. ఇది జానపదం కాబట్టి.. అందరిదీ అన్నది సుద్దాల అభిప్రాయం. ఈ విధంగా రోజుల తరబడి వివాదం కొనసాగింది.

ఎట్టకేలకు స్పందించిన దర్శకుడు.. వివాదానికి తెరదించారు. ఈ పాటను కోమలితోనే పాడించాలని అనుకున్నామని సుద్దాల అశోక్ తేజకూడా అదే మాట అన్నారని చెప్పారు. కానీ.. కోమలి ఆ సమయంలో అనారోగ్యంతో ఉండడం.. వెంటనే రికార్డు చేయాల్సి రావడంతో.. మంగ్లీతో పాడించామని చెప్పారు. అంతేకాకుండా.. కోమలికి తాము ఇస్తానన్న డబ్బులు ఇస్తామని సినిమా వేడుకలో ఆమెతో పాట కూడా పాడిస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

కాగా.. తాజాగా కమెడియన్ అలీ ఓ ప్రముఖ ఛానల్ లో నిర్వహిస్తున్న టాక్ షోకు శేఖర్ కమ్ముల హాజరయ్యారు. ఈ సందర్భంగా సారంగదరియా వివాదంపై మాట్లాడారు. ఈ పాటను కోమలితోనే పాడించాలని అనుకున్నప్పటికీ కుదరలేదని చెప్పారు. కానీ.. ఈ పాట వివాదానికి దారితీయడం బాధ కలిగించిందన్నారు. సుద్దాల ఈ పాటను ఎంతో బాగా రాశారని అన్నారు. కానీ.. ఈ గొడవతో ఆయన బాధపడ్డారని ఆయనను చూసి తాను కూడా బాధపడ్డానని చెప్పారు.