టైటిల్ వార్: కోనేరు వారసుడి 'వారియర్' - రామ్ పోతినేని 'ది వారియర్'

Mon Jan 17 2022 14:30:44 GMT+0530 (IST)

War On Warrior Title

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇన్నాళ్లూ 'RAPO19' గా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ చిత్రానికి ''ది వారియర్'' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రామ్ ఇందులో క్లీన్ షేవ్ తో ఖాకీ యూనిఫామ్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా అగ్రెసివ్ లుక్ లో ఆకట్టుకున్నారు. అయితే రామ్ ని యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రెజెంట్ చేయబోతున్న 'ది వారియర్' టైటిల్ మీద ఇప్పుడు వివాదం చెలరేగింది.నిజానికి రామ్ చిత్రానికి 'వారియర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.. హీరో కమ్ ప్రొడ్యూసర్ హవీష్ కోనేరు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని తెలుస్తోంది. దీనికి కారణం హవీష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా కోసం ఇప్పటికే అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించి పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు సేమ్ టైటిల్ తో మరో సినిమా వస్తుందని తెలిసి.. సోమవారం అకస్మాత్తుగా ''వారియర్'' అనే ప్రాజెక్ట్ ను కోనేరు వారసుడు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఈ నేపథ్యంలో రామ్ - లింగుస్వామి చిత్రానికి స్వల్ప మార్పులతో ''ది వారియర్'' అనే టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేసారు. అనవసరమైన గందరగోళాన్ని నివారించడానికి టెక్నికల్ అడ్జస్ట్‌మెంట్ చేసినప్పటికీ.. ఇది ఖచ్చితంగా 'వారియర్' అనే పేరుతోనే పిలవబడుతుందని చెప్పవచ్చు. దీంతో ఒకే టైటిల్ తో రెండు సినిమాలు వచ్చే పరిస్థితి తలెత్తింది. అయితే దీనిపై హవీష్ ఓ న్యూస్ వెబ్ పోర్టల్ తో మాట్లాడుతూ ఇది అనైతికమని.. అనుమతించలేమని పేర్కొన్నారు.

హవీష్ స్పందిస్తూ.. “వారియర్ టైటిల్ కోసం వారి టీమ్ నన్ను సంప్రదించింది. కాకపోతే ఇప్పటికే నా స్క్రిప్ట్ రెడీగా ఉండటం.. టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నందున నేను దానిని తిరస్కరించాను. ఈరోజు అనైతికంగా కొన్ని మార్పులతో వారు టైటిల్ ను ప్రకటించారు. ఫిలిం ఛాంబర్ దీన్ని అనుమతించదని అనుకుంటున్నా. నేను ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాను” అని అన్నారు. గతంలో కూడా టాలీవుడ్ లో పలు సినిమాకు సంబంధించి టైటిల్ వార్స్ జరిగాయి. మరి 'వారియర్' టైటిల్ వివాదం రాబోయే రోజుల్లో ఎక్కడిదాకా వెళ్తుందో.. ఈ పేరుతో హవీష్ - రామ్ పోతినేనిలలో ఎవరు ముందుకు వెళ్తారో చూడాలి.