మూవీ రివ్యూ: 'విశ్వరూపం-2'

Fri Aug 10 2018 14:36:05 GMT+0530 (IST)

Vishwaroopam 2 Review

చిత్రం: 'విశ్వరూపం-2'నటీనటులు: కమల్ హాసన్ - పూజా కుమార్ - ఆండ్రియా జెరెమీ - శేఖర్ కపూర్ - రాహుల్ బోస్ - వహీదా రెహ్మాన్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్ - సాను జాన్ వర్గీస్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
రచన - దర్శకత్వం - నిర్మాణం: కమల్ హాసన్

ఐదున్నరేళ్ల కిందట వచ్చిన కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం’ తిరుగులేని విజయాన్నందుకుంది. కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏడాది లోపే సీక్వెల్ రావాల్సింది. కానీ అనివార్య కారణాలతో అది వాయిదా పడి ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజే విడుదలైన ‘విశ్వరూపం-2’ తొలి భాగం లాగే ఆసక్తికరంగా సాగిందా.. కమల్ మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించాడా.. చూద్దాం పదండి.

కథ:

అమెరికాలో పెద్ద ఉపద్రవాన్ని తప్పించిన సీక్రెట్ ఏజెంట్ విసాం అహ్మద్ కశ్మీరీ.. తన భార్య.. తన సహచర సిబ్బందితో కలిసి తర్వాత లండన్ వెళ్తాడు. అక్కడ అతడిని అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని తప్పించుకున్న అనంతరం లండన్ నగరాన్ని నాశనం చేసేందుకు ఉగ్రవాద ముఠాలు భారీ కుట్రకు తెర తీశాయని తెలుస్తుంది. ఆ కుట్ర ఏంటి.. దాన్ని విసాం బృందం ఎలా ఛేదించింది.. ఈ క్రమంలో వారికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కమల్ హాసన్ గొప్ప నటుడే కాదు.. గొప్ప రచయిత.. దర్శకుడు కూడా. ఐతే సగటు ప్రేక్షకుల స్థాయికి మించి ఉండే ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోవడం కష్టమని.. ఆయన సినిమాలు జనరంజకంగా ఉండవని ఒక అభిప్రాయం బలంగా ఉండేది. ఐతే ఆ అభిప్రాయాల్ని తుడిచేసిన సినిమా ‘విశ్వరూపం’. ఉగ్రవాదం నేపథ్యంలో అందరికీ కనెక్టయ్యే కథను ఎంచుకుని.. ఎమోషన్.. యాక్షన్.. థ్రిల్.. అన్నింటినీ సమపాళ్లలో మేలవించి ఈ చిత్రాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దారాయన. ఈ సినిమా కమర్షియల్ గానూ మంచి విజయం సాధించింది. దీని సీక్వెల్ చిత్రీకరణ కూడా తొలి భాగం తీసే సమయంలోనే సగం దాకా పూర్తి చేశాడు కమల్. ‘విశ్వరూపం’ రిలీజ్ తర్వాత కొన్ని నెలల్లోనే మిగతా షూటింగ్ కూడా దాదాపుగా అవగొట్టేశాడు. కాబట్టి ‘విశ్వరూపం-2’ కూడా కచ్చితంగా ‘విశ్వరూపం’ లాగే ఉంటుందని అందరూ ఆశించారు. కానీ ఆశ్చర్యకరంగా ఇది చాలా అనాసక్తికరంగా తయారైంది. తొలి భాగంతో ఎంతమాత్రం పోల్చలేని ఈ సినిమా.. మామూలుగా చూసినా కూడా తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ‘విశ్వరూపం’లో ఉన్న థ్రిల్.. ఉత్కంఠ.. ఎమోషన్.. అన్నీ ఇందులో మిస్సయ్యాయి.

‘విశ్వరూపం’లో కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. గొప్ప ఎమోషన్ కూడా ఉంటుంది. తన కారణంగా అమాయకుడైన తౌఫీక్ ఉగ్రవాదుల చేతిలో హతమవుతుండగా.. అతడి తల్లి హృదయ విదారకంగా రోదిస్తుంటే కరగని మనసుండదు. ఇక అందులో చాలా సింపుల్ గానే హీరోయిజాన్ని పండించిన తీరూ అద్భుతమే. అప్పటిదాకా చాలా అమాయకంగా కనిపించే విశ్వనాథ్.. విసాంగా మారి ఉగ్రవాదుల్ని కళ్లు చెదిరే రీతిలో అంతమొందించే వైనం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అక్కడి నుంచి విసాం పాత్రలోని ఎన్నో కోణాల్ని.. వైరుధ్యాల్ని చూపిస్తూ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ.. థ్రిల్ చేస్తూ సాగుతుంది ‘విశ్వరూపం’. ఇక అందులోని ఆఫ్గనిస్థాన్ ఎపిసోడ్ గురించి.. అందులోని యాక్షన్ ఘట్టాల గురించి చెప్పేదేముంది? ఇలా ఆద్యంతం విశ్వరూపం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తే.. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘విశ్వరూపం-2’ మాత్రం పూర్తి భిన్నంగా సాగుతుంది.

విసాం పాత్రలో విభిన్న కోణాలుండటం.. ఆ పాత్ర అంతు చిక్కకుండా సాగడమే ‘విశ్వరూపం’కు పెద్ద ఆకర్షణ. రెండో భాగానికి వచ్చేసరికి ఆ పాత్ర చాలా మామూలుగానే కనిపిస్తుంది. ఇక కొత్త కోణాలేమీ చూపించడానికి అవకాశం లేకపోయింది. దీనికి తోడు ఈ కథను నడిపించడానికి పెట్టుకున్న టాస్కులు కూడా చాలా సాధారణంగా తయారయ్యాయి. అమెరికాలో డర్టీ బాంబును ఛేదించినట్లే ఇక్కడ లండన్లోని సముద్ర గర్భంలో ఒక ప్రమాదకర బాంబును నిర్వీర్యం చేసే టాస్క్ ఇచ్చారు హీరోకి. కానీ దీనికి సంబంధించిన ఎపిసోడ్ పూర్తిగా తేలిపోయింది. ముందు పెద్దగా బిల్డప్ ఇచ్చి.. తర్వాత దాన్ని మామూలుగా ముగించేశారు. ‘విశ్వరూపం-2’ మొదలవడం ఆసక్తికరంగా ఉంటుంది. కమల్ మరోసారి థ్రిల్ చేయబోతున్నాడనిపిసి్తుంది. కానీ అరగంట తిరక్కముందే ‘విశ్వరూపం-2’ దారి తప్పుతుంది. బోరింగ్ సన్నివేశాలతో ఆసక్తిని పోగొట్టేస్తుంది. విసాం మీద జరిగే కుట్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తేలిపోయాయి. అవి అసలు కథకు దూరంగా సాగడం ఆసక్తిని చంపేస్తుంది. హీరో హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ కూడా సాధారణమే.

ఓవైపు హీరో పాత్ర నిరాశ పరిస్తే.. మరోవైపు తొలి భాగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విలన్ పాత్రను ఇందులో బాగా డైల్యూట్ చేసేశారు. చివరి అరగంటలో మినహాయిస్తే ఒమర్ పాత్ర ఇందులో కనిపించకపోవడం పెద్ద మైనస్. ఆ పాత్ర ప్రవేశంతోనే మళ్లీ కొంచెం ఆసక్తి వస్తుంది. చివరి అరగంట ఓకే కానీ.. ఇలాంటి సినిమాకు ఇంకా మెరుగైన ముగింపు ఆశిస్తాం. ఇందులో తొలి భాగానికి సంబంధించిన దృశ్యాల్ని ఫ్లాష్ లు ఫ్లాష్ లుగా ఇందులో చూపించారు. అవి వచ్చినపుడల్లా.. ఒక ఎగ్జైట్మెంట్ కలుగుతుంది కానీ.. మళ్లీ వర్తమానంలోకి వస్తే కథనం నిస్సారంగా నడుస్తుంది. అసలు విసాం గూఢచారి అని ఒమర్ ఎలా పసిగట్టాడో.. వాళ్లిద్దరికి ఎక్కడ క్లాష్ వచ్చింది అన్న విషయాల్ని రెండో భాగం కోసం దాచి పెట్టాడు కమల్. కానీ దానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఏమంత ఉత్కంఠభరితంగా లేకపోయింది. మొత్తంగా ‘విశ్వరూపం’ను ఎంతో ఇష్టపడి రెండో భాగాన్ని చూస్తే నిరాశ తప్పదు. ఇక కమల్ అన్నట్లుగా రెండో భాగం చూసి మొదటిదానిపై ఆసక్తి పెరగడం అన్నది కామెడీనే. ‘విశ్వరూపం’ చూసిన వాళ్లు ప్రతి ఒక్కరూ రెండో భాగం చూడకుండా ఆగలేరు. కానీ వాళ్లంతా సాధ్యమైనంత తక్కువ అంచనాలతో వెళ్తే మంచిది.

నటీనటులు:

కమల్ హాసన్ బాగానే చేశాడు కానీ ‘విశ్వరూపం’తో పోలిస్తే ఇందులో ఆయన పాత్రలో పెద్దగా వేరియేషన్ కనిపించదు. డిఫరెంట్ ఎమోషన్లు చూపించడానికి.. తన ప్రత్యేకతను చాటుకోవడానికి పెద్దగా అవకాశం లేకపోయింది. జ్నాపకశక్తి కోల్పోయిన తన తల్లిని చూసినపుడు ఉద్వేగానికి గురయ్యే సన్నివేశంలో మాత్రం కమల్ ప్రత్యేకత కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల కోసం ఈ వయసులోనూ ఆయన పడ్డ కష్టం అభినందనీయం. పూజా కుమార్.. ఆండ్రియా బాగానే చేశారు. శేఖర్ కపూర్ ఓకే. రాహుల్ బోస్ ఉన్నంతసేపూ తన ముద్ర చూపించాడు. కానీ ఇందులో అతడికి స్కోప్ తక్కువే. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది కానీ.. ‘విశ్వరూపం’లో శంకర్-ఎహ్సాన్-లాయ్ ఒక ముద్ర వేసిన నేపథ్యంలో.. సిగ్నేచర్ థీమ్స్ మిస్సయిన ఫీలింగ్ ఇందులో వెంటాడుతుంది. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాల్లో ‘విశ్వరూపం’ టైటిల్ థీమ్ లేని లోటు కనిపిస్తుంది. జిబ్రాన్ అందించిన రెండు పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. శ్యామ్ దత్-సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు మామూలుగానే అనిపిస్తాయి. తొలి సినిమా స్థాయి భారీతనం.. లొకేషన్లు ఇందులో కనిపించవు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కమల్ హాసన్.. రెండో భాగం కోసం ఆసక్తికర కథాకథనాలు రాసుకోలేదు. స్క్రీన్ ప్లేలో బిగి లేకపోయింది. అనాసక్తికర సన్నివేశాలతో కమల్ నిరాశ పరిచాడు.

చివరగా: విశ్వరూపం-2.. విశ్వరూపం కాదు

రేటింగ్-1.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre