Begin typing your search above and press return to search.

'సడక్ 2' ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న విశ్వ హిందూ పరిషత్...!

By:  Tupaki Desk   |   13 Aug 2020 2:30 PM GMT
సడక్ 2 ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న విశ్వ హిందూ పరిషత్...!
X
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌ లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. బాలీవుడ్‌ లో బంధుప్రీతి వల్ల బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా.. వారికి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన 'సడక్ 2' ట్రైలర్‌ కు డిస్ లైక్‌ ల వరద కొనసాగుతోంది. 1991లో వచ్చిన 'సడక్‌' చిత్రానికి సీక్వెల్‌ గా ఈ మూవీ తెరకెక్కింది. సంజయ్‌ దత్‌ - అలియా భట్‌ - ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'సడక్ 2' చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. సుశాంత్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మహేష్ భట్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మొదటి నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది. ఈ క్రమంలో ట్రైలర్ కి ఇప్పటి వరకు 5.8 మిలియన్ డిస్ లైక్స్ వచ్చాయంటేనే ఈ సినిమాపై ఎంత నెగిటివిటీ ఉందో అర్ధమవుతోంది. అయితే తాజాగా విశ్వ హిందూ పరిషత్ ఏకంగా సినిమాపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.

కాగా 'సడక్ 2' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పుడే అది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆచార్య చంద్ర కిశోర్ అనే వ్యక్తి ముజాఫర్ పూర్ కోర్ట్ లో పిటిషన్ ధాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా విశ్వ హిందూ పరిషత్ సైతం అదే వాదన వినిపిస్తోంది. ఈ ట్రైలర్ లో పలు సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని.. ఈ సినిమాపై బ్యాన్ విధించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని.. ఆ సినిమాని ప్రసారం చేసే డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ యాప్‌ ను అన్ ఇన్‌స్టాల్ చేయాలని సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇంత నెగిటివిటీ మధ్య ఈ నెల 28న విడుదల కాబోతున్న 'సడక్ 2' ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.