జిమ్ లో విష్ణు-జెనిలీయా రీక్రియేషన్ సూపర్బ్!

Mon May 23 2022 12:00:01 GMT+0530 (IST)

Vishnu Genelia Recreation Superb in the Gym

మంచు విష్ణు-జెనిలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన `ఢీ` ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సినల పనిలేదు. ఆద్యంతం  కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. విష్ణుకి నటుడిగా మంచి ఐడెంటిటీ తీసుకొచ్చింది. అప్పటివరకూ యాక్షన్ జానర్ చిత్రాలకు పరిచయమైన విష్ణులో కొత్త యాంగిల్ ని తట్టి లేపిన చిత్రమిది.విష్ణు కెరీర్ ప్రస్తావిస్తే `ఢీ` కిముందు తర్వాత అని కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అంతగా ఈ సినిమా విష్ణు కెరీర్ కి దోహద పడింది.  ఆసక్సెస్  తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. నటుడిగా మరింత బిజీ అయ్యాడు. బయట బ్యానర్లు విష్ణు తో సినిమా నిర్మించడానికి  ఉత్సాహం చూపించేవి. ఇక జెనీలియా కెరీర్ ని టాలీవుడ్ లో మరింత బిజీ నటిగా మార్చడంలో `ఢీ` సక్సెస్ కీలక పాత్ర పోషించింది.

అప్పటికే బొమ్మరిల్లు హాసినిగా తెలుగు ప్రేక్షకుల్లో ముద్ర వేసిన అమ్మడు ఢీ సక్సెస్ తర్వాత కెరీర్ గ్రాఫ్ మరింత మెరుగు పడింది. వరుస అవకాశాలతో అగ్రహీరోల సరసన ఛాన్సు లు అందుకుంది. మరోవైపు కోలీవుడ్ లోనూ అదే వేవ్ లో చక్కని అవకాశాలు ఒడిసి పట్టుకుంది. ఇక ఈ సినిమాతో  దర్శకుడు శ్రీనువైట్ల కు ప్రత్యేకమైన ఐడెంటిటీ దక్కింది.

అప్పటికే `వెంకీ`తో మంచి కామెడీ దర్శకుడిగా మారారు. అదే సమయంలో ఢీ లాంటి కంటెంట్ తో తనలో హాస్యాన్ని మరింత బయటకు తీయగలిగారు. ఈ సక్సెస్ ఎన్నో కొత్త అవకాశాల్ని తెచ్చిపెట్టింది. దివంగత నటుడు శ్రీహరికి ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చిపెట్టిన చిత్రమిది. తాజాగా సినిమా విడుదలై   ఈ ఏడాది తో 15 ఏళ్లు పూర్తయింది.

ఈ సందర్బంగా విష్ణు-జెనిలియా ఈ సినిమాలోని ఐకానిక్  ఓస్టిల్ ని రీక్రియేట్ చేసారు. జిమ్ లో ఇద్దరు కలిసిన సందర్భంలో చేతులు పైకెత్తి కండలు చూపించే ప్రయత్నం చేసారు. సినిమాలో ఆనాటి స్టిల్ ని..ఈ కొత్త ఫోటో జోడించి నెట్టింట షేర్ చేసారు.  `నా టింకర్ బెల్ మరి నేను` అని విష్ణు క్యాప్షన్ ఇచ్చారు. మేము ఇద్దరం ఇంకా అలాగే ఉన్నాం. ఎలాంటి మార్పు రాలేదు` అని రాసుకొచ్చారు.

ఇక ఈ ఫోటోని జెనిలియా  ఇన్ స్టా స్టోరీస్ లో  షేర్ చేసింది. ప్రస్తుతం జెనీలియా  ముంబైలో స్థిరపడిన సంగతి తెలిసిందే.  మిస్టర్ మేధావి సినిమా తర్వాత జెనిలియా  బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఓవైపు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీలో ప్రధానంగా ఫోకస్ చేసింది. చివరిగా బాలీవుడ్ లో  స్థిరపడింది. రితీష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని హిందీ పరిశ్రమకే తన సేవల్ని పరిమితం చేసింది. ఇక విష్ణు తెలుగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.