జనవరి రేసులో జాయిన్ అయిన మరో హీరో

Wed Nov 24 2021 11:59:39 GMT+0530 (IST)

Vishal veeramme Vaagai Soodum In January

కరోనా వల్ల సినిమాలకు కరువు వచ్చింది. ప్రేక్షకులు నెలల తరబడి థియేటర్ల మొహం చూసి ఎగరలేదు. ఇటీవల థియేటర్లు మళ్లీ ఓపెన్ అయినా కూడా భారీ సినిమాలు రాకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎట్టకేలకు భారీ సినిమాలు.. క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాయి. డిసెంబర్ నుండి సినిమాల జాతర మొదలు అవ్వబోతుంది.జనవరిలో ఆ జాతర పీక్స్ కు చేరబోతుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఈమద్య కాలంలో చూసిందే లేదు. కాని జనవరిలో రాబోతున్న సినిమాలు రికార్డులు బ్రేక్ చేయడం ఏంటీ ఇండస్ట్రీలో సరికొత్త శకంను సృష్టించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

జనవరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బాక్సాఫీస్ సందడి మొదలు అవ్వబోతుంది. సంక్రాంతికి వారం రోజుల ముందే రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి పూర్తి అయిన వారం రోజుల తర్వాత కూడా కంటిన్యూ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చిన వారం రోజుల్లోనే రాధే శ్యామ్.. భీమ్లా నాయక్ సినిమాలు కొద్ది తేడాతో సంక్రాంతి పోటీలో దిగబోతున్నాయి. వీటితో పాటు బంగార్రాజు కూడా సంక్రాంతికే విడుదల అంటున్నారు. అయితే ఆ సినిమా అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇక జనవరి రేసులో ఈ సినిమాలు ఉన్నది సరిపోనట్లు తమిళ స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

తమిళంలో రూపొందిన వాలిమై సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరిలోనే రాబోతున్న విషయం తెల్సిందే. అజిత్ సినిమాలకు తెలుగు పెద్దగా క్రేజ్ లేదు.. కాని కార్తికేయ నటించడం వల్ల తెలుగు ఆడియన్స్ ఆ సినిమా వైపు చూస్తున్నారు. ఇక విశాల్ హీరోగా నటించిన వీరమే వాగై సోదుమ్ ను తెలుగు లో సామాన్యుడు అనే టైటిల్ తో డబ్బింగ్ చేయబోతున్నారు.

విశాల్ ఇటీవలే ఎనిమి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో జనవరి రేసులో ఈ సినిమా నిలుస్తుందని.. ఇతర సినిమాలకు ఖచ్చితంగా పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మొత్తానికి విశాల్ సామాన్యుడితో జనవరి పోటీ మరింత రసవత్తరంగా మారుతుందేమో చూడాలి. సామాన్యుడు సినిమా రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హాట్ బ్యూటీ డింపుల్ హయతీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు లో సామాన్యుడు ను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.