తమిళ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విశాల్

Mon May 25 2020 16:40:13 GMT+0530 (IST)

Vishal is shaking up the Tamil film industry

తమిళ సినీ పరిశ్రమలో సంచలన హీరో విశాల్. మన తెలుగువాడైన విశాల్ అక్కడ  తమిళ సినీ కళాకారుల సంఘాల్లో పోటీచేసి గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాడు. దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా.. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పోటీచేశారు.  గెలిచి తమిళ సినీ కళాకారులకు సేవ చేశాడు. ఈ రెండు సంఘాల్లో గొడవలు చెలరేగి   వివాదాలతో అవి కోర్టు మెట్లు ఎక్కడం.. సంఘాలు రద్దు కావడం తెలిసిందే. ప్రత్యేక అధికారికి అప్పగించి పాలిస్తున్నారు.తాజాగా నటుడు విశాఖ మరోసారి తమిళ సినీ ఇండస్ట్రీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రెండు మండలిలు జూన్ 21న జరగాలని మద్రాస్ హైకోర్టు ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రస్తుతం మహమ్మారి.. -నిర్బంధం కారణంగా ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కొందరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 30లోగా  నిర్మాతల మండలి ఎన్నికలను నిర్వహించాలని.. ఆ వివరాలను అక్టోబర్ 30లోగా కోర్టుకు సమర్పించాలని ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇప్పటికే తమిళ నిర్మాతలు మూడు టీంలుగా విడిపోయి పోటీచేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పోటీకి దూరంగా ఉంటానని అనుకున్న పూర్వ అధ్యక్షులు విశాల్ కూడా మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నట్టు తాజాగా సమాచారం. తన పూర్వ టీంతోనే మళ్లీ పోటీకి దిగనున్నట్లు  ప్రకటించారు. దీంతో విశాల్ ఎంట్రీ తమిళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.